చీరలో ఉన్న ఫొటోలు పంపించు! మహిళా ఉద్యోగికి సీఐడీ అధికారి వేధింపులు
హైదరాబాద్: ఓ మహిళను వేధింపులకు గురిచేసిన తెలంగాణ సీఐడీ డీఎస్పీ కిషన్ సింగ్‌పై కేసు నమోదైంది. కిషన్ సింగ్ తనను వేధిస్తున్నారంటూ టీఎస్ఎస్పీడీసీఎల్ మహిళా ఉద్యోగి చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కిషన్ సింగ్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
కిషన్ సింగ్.. అసభ్యకర మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు నా ఫోన్‌కు పంపిస్తున్నారు. చీర కట్టుకుని ఉన్న ఫొటోలు పంపాలంటూ వేధిస్తున్నారు. ఆ టార్చర్ తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించాను అని బాధిత మహిళా ఉద్యోగి తెలిపారు. ఈ మేరకు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు.

రెండేళ్ల క్రితం సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో కిషన్ సింగ్ పరిచయమైనట్లు ఆమె తెలిపారు. ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని తనను వేధింపులకు గురిచేస్తున్నాడని చెప్పారు. తనతో చనువుగా ఉండాలని మెసేజ్ లు పెడుతున్నారని తెలిపారు. ఇది పద్ధతి కాదని చెప్పినా వినకుండా వేధిస్తుండటంతో పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పారు. ఈ క్రమంలో సీఐడీ ఎస్పీపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ ఢీకొని ఇద్దరు మహిళల మృతి : సికింద్రాబాద్ బొల్లారంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వాకింగ్ కోసం పార్క్‌కు వెళ్తుండగా బైక్ ఢీకొనడంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిత్య అనే ఐటీ ఉద్యోగి బైక్‌పై బొల్లారం నుంచి శామీర్‌పేటకు వెళ్తున్నాడు.
ఈ క్రమంలో అటుగా రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలు రాధిక, బాలమ్మలను అతడు బైక్‌తో బలంగా ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications