నో డౌట్- వారి వల్లే కర్నూలు బస్ ప్రమాదం
హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ వీఎస్ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాగుబోతు డ్రైవర్లను ఉగ్రవాదులు, మానవ బాంబులని అభివర్ణించారు. అమాయకుల ప్రాణాలను ప్రమాదంలో పడేసే వారికి ఎటువంటి దయాదాక్షిణ్యాలు ఉండవని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాలో వీకావేరీకి చెందిన ప్రైవేటు బస్సు బస్సు అగ్నిప్రమాదానికి గురైన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో 20 మంది మరణించారు. బీ శివశంకర్ మందు తాగి బండి నడపడం వల్లే ఈ ఘోరం చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు.
ఓ బైకును ఢీకొట్టిన హైదరాబాద్-బెంగళూరు ప్రైవేట్ స్లీపర్ బస్సు ప్రమాదంపై సజ్జనార్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన బైకర్ మద్యం సేవించి వాహనం నడిపాడని, ప్రమాదానికి అతనే కారణమని సజ్జనార్ తెలిపారు. ఇలాంటి చర్యలు రోడ్లపై ఉగ్రవాద చర్యలతో సమానమని, ఈ సంఘటన నేరపూరిత నిర్లక్ష్యపు చర్య అని అన్నారు. "తాగి వాహనాన్ని నడిపే డ్రైవర్లందరూ ఉగ్రవాదులే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. వారి చర్యలు ఉగ్రవాద కార్యకలాపాలతో సమానం.." అని చెప్పారు.

20 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న కర్నూలు బస్సు ప్రమాదం నిజమైన ప్రమాదం కాదు. తాగి డ్రైవ్ చేసిన బైకర్ నిర్లక్ష్యపు, బాధ్యతారహితమైన ప్రవర్తన వల్ల సంభవించిన ఘటన. నివారించదగ్గ మారణహోమం. క్షణాల్లో కుటుంబాలను నాశనం చేసిన నేరపూరిత నిర్లక్ష్యపు చర్య.." అని సజ్జనార్ తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
"బీ శివశంకర్ అనే బైకర్ మద్యం సేవించాడని, సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం, అతను తెల్లవారుజామున 2:24 గంటలకు తన మోటార్‌సైకిల్‌కు ఇంధనం నింపుతున్నట్లు కనిపిస్తోందని, ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే అతను నియంత్రణ కోల్పోయి 2:39 గంటలకు ఘోర ప్రమాదానికి కారణం అయ్యాడని వివరించారు. తాగి డ్రైవ్ చేయాలనే అతని అహంకారపూరక నిర్ణయం ఊహించలేని విషాదాన్ని మిగిల్చిందని వ్యాఖ్యానించారు.
తాగుబోతు డ్రైవర్లు ఉగ్రవాదులనే తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్న సజ్జనార్ తేల్చి చెప్పారు. అటువంటి వ్యక్తులు తోటి వాహనదారుల జీవితాల, కుటుంబాలు, భవిష్యత్తును నాశనం చేస్తారని అన్నారు. హైదరాబాద్ సిటీలో తాగి వాహనం నడపడం పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ దొరికిన ప్రతి ఒక్కరూ చట్ట ప్రకారం శిక్షను ఎదుర్కొనక తప్పదని సజ్జనార్ పునరుద్ఘాటించారు.
"అమాయకుల ప్రాణాలను ప్రమాదంలో పడేసే వారికి ఎటువంటి కనికరం, మినహాయింపులు, దయ ఉండవు. తాగి డ్రైవ్ చేయడాన్ని ఒక పొరపాటుగా చూడటం మానేయాలి. ఇది జీవితాలను నాశనం చేసే నేరం, తదనుగుణంగా శిక్షను అనుభవించాలి.." అని ఆయన అన్నారు. "వాళ్ళు చేసిన ఈ తప్పిదం వల్ల ఎన్ని కుటుంబాలు మానసిక క్షోభను అనుభవిస్తున్నాయి. మీ సరదా, జల్సా కోసం ఇతరుల ప్రాణాలను తీసే హక్కు మీకు ఎవరిచ్చారు!?" అని సజ్జనార్ ప్రశ్నించారు.
సమాజంలో మన చుట్టే తిరిగే ఇలాంటి టెర్రరిస్టులు, మానవ బాంబుల పట్ల జాగ్రతగా ఉండాలని, వీరి కదలికలపై వెంటనే డయల్ 100 కి గానీ, స్థానిక పోలీసులకు గానీ సమాచారం ఇవ్వాలని సూచించారు. చూస్తూ చూస్తూ వాళ్ళను ఇలాగే వదిలేస్తే రోడ్డు మీదకు వచ్చి ఎంతో మందిని చంపేస్తారు. వారిని మాకెందుకులే అని వదిలేస్తే చాలా ప్రాణ నష్టం జరుగుతుంది.. అని సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications