హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ లో.. ‘దిన దిన గండం’, పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం, బెంబేలెత్తిపోతున్న జనం!

హైదరాబాద్‌లోని మళ్లీ వర్షం కురుస్తోంది. మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపై నీళ్లు చేరడం, ఇళ్లల్లోకే నీరు వచ్చేయడంతో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం కురుస్తోంది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు కురిసిన వర్షం దెబ్బకు పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

మళ్లీ మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపై నీళ్లు చేరడం, లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకే నీరు వచ్చేయడంతో హైదరాబాద్ లో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది.

కురుస్తూనే ఉన్న వర్షం...

కురుస్తూనే ఉన్న వర్షం...

కుండపోతతో హైదరాబాద్‌ నగరం చిగురుటాకులా వణికిపోయింది. పట్టపగలే చీకట్లు కమ్ముకుని.. ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం నగరంలో అలజడి సృష్టించింది. సోమవారం సాయంత్రం 4 గంటలకు మొదలై.. రాత్రి 9 గంటల వరకు విలయ తాండవం చేసింది. నగరంలోని పలు చోట్ల కేవలం రెండు గంటల వ్యవధిలోనే పది సెంటీమీటర్లకుపైగా కుండపోత కురిసింది. మీరాలంలో ఏకంగా 13.5 సెంటీ మీటర్లు, రాజేంద్రనగర్, అంబర్‌పేటల్లో 12 సెంటీ మీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది.

Recommended Video

Heavy Rains Crippled Normal Life In Hyderabad భారీ వర్షానికి వణికిన భాగ్యనగరం | Oneindia Telugu
నీట మునిగిన బస్తీలు.. రహదారులు చెరువులే...

నీట మునిగిన బస్తీలు.. రహదారులు చెరువులే...

వరద నీటితో హైదరాబాద్ లోని చాలా బస్తీలు నీట మునిగాయి. రహదారులు చెరువులను తలపించాయి. చాలా చోట్ల ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. దీంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో జీహెచ్‌ఎంసీ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసింది.మంగళవారం మళ్లీ హైదరాబాద్ లో వర్షం కురిసింది. హయత్‌నగర్, సరూర్‌నగర్, చాంద్రాయణ గుట్ట, హబ్సిగూడ, ఓయూ, లాలాపేట్, నాచారం, మల్లాపూర్, శంషాబాద్, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, ఉప్పల్, ఎల్‌బీనగర్, తార్నాక, హిమాయత్‌నగర్, చిక్కడపల్లి, ఛార్మినార్‌, యాకుత్‌ పురా, అప్ఝల్‌ గంజ్‌ ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా కురుస్తూనే ఉంది.

ఉధృతంగా ప్రవహిస్తోన్న మూసీ...

ఉధృతంగా ప్రవహిస్తోన్న మూసీ...

అటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనూ కుండపోత కురిసింది. ముఖ్యంగా పాత మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలు చోట్ల వాగులు వంకలు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. చాలా చోట్ల వాగులు వంకలు ఉప్పొంగాయి. నీరు రహదారులపైకి చేరడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. పలు చోట్ల చెరువులు నిండిపోయాయి. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో కుండపోతగా కురిసింది. భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, బీబీనగర్, పోచంపల్లి, మోటాకొండూరు సహా అన్ని మండలాల్లో భారీ వర్షంతో ప్రజలు బయటకు రాలేకపోయారు. బీబీనగర్‌ మండలం జమీలాపేట్‌-జియాపల్లి వద్ద చెరువు అలుగు పోస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్‌లో కురుస్తున్న కుండపోత వర్షంతో ఆ నీరంతా మూసీలోకి చేరి.. ఉధృతంగా ప్రవహిస్తోంది. మూసీ పరీవాహకం ప్రాంతాలలోని బీబీనగర్, పోచంపల్లి, వలిగొండమండలాల్లో అధికారులను కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ అప్రమత్తం చేశారు.

ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు...

ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు...

రాయలసీమపై ఉపరితల ఆవర్తనం, ఒడిశా, కేరళ మధ్య తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వై.కె.రెడ్డి వెల్లడించారు. మంగళవారం నుంచి మరో మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని హెచ్చరించారు. సోమవారం రాజేంద్రనగర్‌లో 11, అంబర్‌పేట, గోల్కొండలలో 9, కోస్గి, హన్స్‌వాడలలో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజులు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు ముందస్తు సహాయక చర్యలను చేపడుతున్నారు.

రికార్డు బ్రేక్ వర్షాలు...

రికార్డు బ్రేక్ వర్షాలు...

హైదరాబాద్ లో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు 13.2 సెం.మీల వర్షపాతం నమోదైంది. అక్టోబర్ నెలలో ఈ స్థాయి వర్షం కురవడం గత పదేళ్లలో ఇదే మొదటిసారని వాతావరణశాఖ డైరెక్టర్ వైకే రెడ్డి తెలిపారు. వర్షాకాలం ముగిసిన తర్వాత ఈ స్థాయిలో వర్షాలు పడడం అరుదన్నారు. గతంలో 2013 అక్టోబర్ 10వ తేదీన 9.8 సెం.మీల వర్షపాతం నమోదైందని, ఇప్పుడు ఆ రికార్డు బ్రేక్ అయ్యిందని వాతావరణశాఖ డైరెక్టర్ వైకే రెడ్డి చెప్పారు. అంతేకాకుండా ఈ ఏడాది నమోదైన అత్యధిక వర్షపాతంగా సోమవారం కురిసిన వర్షం నిలిచిందన్నారు.

క్యుములోనింబస్‌ మేఘాల వల్లనే...

క్యుములోనింబస్‌ మేఘాల వల్లనే...

ప్రస్తుత సీజన్‌లో గాలిలో తేమశాతం అధికంగా ఉండడం, మరోవైపు ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణంలో అస్థిరత ఏర్పడి... అత్యంత ఎత్తు, తీవ్రత, ఉధృతి కలిగిన క్యుములో నింబస్‌ మేఘాలు ఏర్పడుతున్నాయని వాతావరణ శాస్త్రవేత్త రాజారావు తెలిపారు. వాటి కారణంగానే సాయంత్రం 4 గంటలకే చీకట్లు కమ్ముకుని, తక్కువ సమయంలో అధిక వర్షపాతం సంభవిస్తోందని వెల్లడించారు. సాధారణంగా వేసవిలో ఏర్పడే క్యుములోనింబస్‌ మేఘాల కంటే.. ఇప్పుడు ఏర్పడే వాటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు.

అధికారులు అప్రమత్తంగా ఉండాలి...

అధికారులు అప్రమత్తంగా ఉండాలి...

నగరంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. తీసుకోవాల్సిన సహాయక చర్యలపై సచివాలయంలో జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులతో మంత్రి కేటీఆర్‌ సమీక్షించారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులను వెంటనే పునరుద్ధరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. రాబోయే రెండ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సహాయక చర్యల్లో జీహెచ్ఎంసీ, జలమండలి...

సహాయక చర్యల్లో జీహెచ్ఎంసీ, జలమండలి...

నగర వాసులకు ఇబ్బందులు కలగకుండా జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులు సహాయ చర్యలు ప్రారంభించినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. 140 మన్సూన్‌ ఎమర్జెన్సీ బృందాలు, 50 స్టాటిక్‌ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయని చెప్పారు. జీహెచ్‌ఎంసీలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూం ద్వారా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని ఆయన వివరించారు. ఎలాంటి పరిస్థితినైనా వెంటనే చక్కదిద్దేలా కృషి చేస్తోందని చెప్పారు. పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు కూలడం, విద్యుత్‌ తీగలపై చెట్లు విరిగిపడడంతో వాటిని తొలగించే పని చేపట్టారని తెలిపారు. వర్షాలు కొనసాగుతూనే ఉండడంతో సహాయక చర్యలకు కొంత ఆటంకంగా మారిందన్నారు. పరిస్థితులను నగర మేయర్, మున్సిపల్‌ కమిష నర్‌ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని చెప్పారు.

English summary
In the wake of heavy rains lashing the city since Monday night, Municipal Administration and Urban Development Minister K T Rama Rao on Tuesday directed officials to restore damaged roads in the city without delay. At a review meeting with officials from different departments here, the Minister said there was a forecast of heavy rains for the next 48 hours. Directing the GHMC and other departments to stay alert and focus on low lying areas, he wanted relief measures to be taken up immediately and power supply restored without further delays. As many as 140 monsoon emergency teams and 50 static teams were pressed into service for relief and rescue operations. Rao also wanted the officials to address grievances registered through Dial 100, GHMC Call centre and MyGHMC app.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X