హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి వీడియో మార్ఫింగ్: వ్యక్తి అరెస్ట్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కించపరిచేలా వీడియోను రూపొందించి వైరల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప్పల్ సమీపంలోని పీర్జాదిగూడలో నివాసం ఉంటున్న 29 ఏళ్ల నిందితుడు చామకూరి లక్ష్మణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు ఓ ఫొటోగ్రాఫర్‌గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేయర్ విజయలక్ష్మి, మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్న వీడియోను అనుచిత, అవమానకరమైన ఫార్మాట్‌లో మార్ఫింగ్ చేసి ఎక్స్(ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తో సహా ఇతర సోషల్ మీడియా ప్టాట్ ఫారంలలో పోస్టు చేశాడు లక్ష్మణ్. ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు లక్ష్మణ్‌ను అరెస్ట్ చేశారు.

నిందితుడి వద్ద నుంచి ఒక మొబైల్ ఫోన్, ఇతర నేరారోపణ సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. మరోవైపు, లక్ష్మణ్‌ను అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. కాగా, ఏదైనా సోషల్ మీడియా వేధింపులు లేదా తప్పుడు సమాచారం ఫిర్యాదు కోసం cybercrime.gov.in సంప్రదించవచ్చు.
ఇది ఇలావుండగా, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌పై అనుచిత పోస్టులు పెట్టిన నిందితుడ్ని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశాడు నిందితుడు. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాలలో స్పీకర్ ప్రసాద్ మాట్లాడిన వీడియోలను సేకరించి, స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి, కించపరిచే విధంగా పోస్టులు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఈ విషయంపై గతంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అసెంబ్లీ కార్యదర్శి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు.. వికారాబాద్ మోమిన్ పేటకు చెందిన నిందితుడు విజయ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.












Click it and Unblock the Notifications