ఆర్ధికబలం కోసం కీలక అడుగు వేసిన హైదరాబాద్ మెట్రో!
హైదరాబాద్ మెట్రో విషయంలో తెలంగాణా ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలను తీసుకుంటున్న విషయం తెలిసిందే.ఇప్పటికే మెట్రోను టేకోవర్ చేసిన సర్కార్, మెట్రో రైలు సేవలను మరింత సమర్థవంతంగా నడపడానికి తాజాగా మరోమారు కీలక చర్య తీసుకుంది. రూ.13,600 కోట్ల విలువైన రుణాలను రీఫైనాన్స్ చేసేందుకు హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ (HMRL) ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC)తో ఒప్పందం కుదుర్చుకుంది.
మెట్రో రీ ఫైనాన్స్ కు ఒప్పందం
ఈ ఒప్పందం ద్వారా మెట్రో సంస్థ ఆర్థిక భారం తగ్గి, మెట్రో దీర్ఘకాలిక స్థిరత్వం సాధించనుంది. డిల్లీలో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో IRFC చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ కుమార్ దూబె, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు సమక్షంలో అధికారులు సంతకాలు చేశారు. 20 ఏళ్ల కాలపరిమితితో త్రైమాసిక వాయిదాలలో రుణాలను చెల్లించేలా ఈ రీఫైనాన్సింగ్ ఏర్పాటు చేయబడింది.

మెట్రో కనెక్టివిటీని మరింత బలోపేతం చేస్తామన్న సీఎస్
ఈ ఒప్పందం సందర్భంగా సీఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ, హైదరాబాద్ మెట్రోలో 100 శాతం యాజమాన్య వాటా ప్రభుత్వానికి బదిలీ అయిన విషయాన్ని ప్రకటించారు. హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థను ఆధునికీకరించడం మరియు మెరుగుపరచడం ప్రభుత్వం అగ్ర ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. హైదరాబాద్ దేశ ఆర్థిక వృద్ధికి కీలక ఇంజిన్‌గా ఉందని, మెట్రో కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడం ద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గి, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించవచ్చన్నారు.
ఆర్ధిక ఒత్తిడి నుండి ఊపిరి పీల్చుకోనున్న మెట్రో
ఈ రీఫైనాన్సింగ్ ద్వారా మెట్రో సంస్థ ఆర్థిక ఒత్తిడి నుంచి ఊపిరి పీల్చుకుంటుంది. ప్రస్తుతం ఉన్న అధిక వడ్డీ రుణాలను తక్కువ వడ్డీ రేట్లతో భర్తీ చేయడం ద్వారా ఆర్థిక ఆదా సాధ్యమవుతుంది. ఇది మెట్రో సర్వీసుల విస్తరణ, నిర్వహణ మరియు కొత్త లైన్ల నిర్మాణానికి ఉపయోగపడుతుంది. ఈ ఒప్పందంలో భారత ప్రభుత్వం, IRFC, ఎల్ అండ్ టి మరియు HMRL బృందాల సహకారాన్ని సీఎస్ ప్రశంసించారు.
ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్న సీఎస్
హైదరాబాద్‌లో సమర్థవంతమైన, సుస్థిరమైన ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ చర్య వల్ల మెట్రో ప్రయాణికుల సంఖ్య పెరిగి, నగర ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సహాయం ద్వారా మెట్రో సేవల నాణ్యత మరింత మెరుగుపడి, నగర ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకనుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది..













Click it and Unblock the Notifications