లాంగ్ వీకెండ్ వేళ.. హైదరాబాద్ జూపార్క్ కు వెళ్లే వారికి ముఖ్య గమనిక
హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటైన నెహ్రూ జూలాజికల్ పార్క్ లాంగ్ వీకెండ్స్, పండగల సీజన్‌ను పురస్కరించుకుని పర్యాటకుల తాకిడికి సిద్ధమవుతోంది. రానున్న రోజుల్లో నగరవాసులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున సందర్శకులు జూ పార్కుకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకుంటోన్నారు. పక్కా ప్లానింగ్ తో రావడం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆహ్లాదకరంగా గడపవచ్చని సూచిస్తోన్నారు.
సాధారణంగా దసరా, దీపావళి వంటి పండగలు, విద్యాసంస్థలకు వరుస సెలవులు ప్రకటించిన రోజుల్లో జూ పార్కుకు వచ్చే పర్యాటకుల సంఖ్య రెట్టింపు అవుతుంది. శని, ఆదివారాలతో పాటు వరుసగా వచ్చే ప్రభుత్వ సెలవు దినాల్లో కుటుంబ సమేతంగా పర్యాటకులు వన్యప్రాణులను వీక్షించేందుకు ఎంతో ఆసక్తి చూపుతారు. ఈ శని, ఆదివారాలతో పాటు సోమవారం నాడు వినాయక చవితి సెలవు కావడం వల్ల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.

జనం తాకిడిని దృష్టిలో ఉంచుకుని కౌంటర్ల వద్ద గంటల తరబడి క్యూలైన్లలో నిలబడే ఇబ్బందులను తప్పించుకోవాలని జూ అధికారులు కోరుతున్నారు. నెహ్రూ జూలాజికల్ పార్క్ అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ ఆండ్రాయిడ్ యాప్ ద్వారా ముందస్తుగానే ఆన్‌లైన్‌లో ప్రవేశ టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించారు. ప్రవేశ టికెట్లతో పాటు జూ లోపల అందుబాటులో ఉండే సఫారీ రైడ్స్, టాయ్ ట్రైన్ వంటి ప్రత్యేక రైడ్‌ల టికెట్లను కూడా సందర్శకులు ఆన్‌లైన్‌లోనే సులభంగా పొందే వీలుంది.
రద్దీ రోజుల్లో జూను సందర్శించే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు జూ అధికారులు విస్తృత స్థాయి ఏర్పాట్లు చేస్తోన్నారు. పర్యవేక్షణ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమిస్తున్నారు. వాహనాల పార్కింగ్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు స్థానిక ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకొని ప్రత్యేక ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపడుతున్నారు. తాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ నిర్వహణపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు.
పర్యావరణం, మూగజీవాలను పరిరక్షించే ఉద్దేశంతో నెహ్రూ జూ పార్కులో ప్లాస్టిక్ వాడకంపై కఠినమైన నిషేధం అమలవుతోంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, కవర్లు, ప్లాస్టిక్ ప్యాకెట్లను లోపలికి అనుమతించబోమని అధికారులు ఖచ్చితంగా చెబుతున్నారు. గేట్ల వద్ద భద్రతా సిబ్బంది తనిఖీ చేసిన తర్వాతే పర్యాటకులను లోపలికి పంపుతారు.
జూ లోపల ప్రయాణించడానికి పర్యావరణ అనుకూల బ్యాటరీ ఆపరేటెడ్ వాహనాలు, చిన్న పిల్లల రైలు వంటి సదుపాయాలు సిద్ధంగా ఉంచారు. జూ సందర్శన వేళలు ఉదయం 8:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు ఉంటుంది. జంతువులకు ఎటువంటి తినుబండారాలు విసరకూడదని, వాటిని ఇబ్బంది పెడితే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.














Click it and Unblock the Notifications
