సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ.. సంచలన నిర్ణయాలు ఇవే..!
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు 2 డీఏలు, రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితులు, ధాన్యం కొనుగోళ్లు, ఇందిరమ్మ బీమా తదితర కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా దాదాపు 235 మండలాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో చేపట్టాల్సిన చర్యలపై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఎల్ నినో పరిస్థితులు చేపట్టాల్సిన ఉపశమన చర్యలపై సూచనలు స్వీకరించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని వర్షాభావ మండలాలను అధికారికంగా కరువు మండలాలుగా ప్రకటించడంతో పాటు బాధిత ప్రాంతాలకు తగినంత ఆర్థిక సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయాలని కేబినెట్ తీర్మానించింది. ఈ మేరకు త్వరలోనే దిల్లీకి వెళ్లి కేంద్రమంత్రులను కలిసి రాష్ట్ర పరిస్థితిని నివేదించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
అయితే ప్రస్తుతం కేబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ కేబినెట్ భేటీలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు 2 డీఏల అంశంపై గుడ్ న్యూస్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఏడాది డిసెంబర్ లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ నిర్వహణపైనా మంత్రివర్గంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక కుటుంబ యజమాని మరణిస్తే రూ.5 లక్షల బీమా ఇచ్చే పథకాన్ని నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి రోజున ప్రారంభించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. వీటితోపాటు పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ యూనివర్సిటీలో విలీనానికి సంబంధించి కేశవరావు కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ను మంత్రివర్గంలో చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వీటితోపాటు మెట్రో రైలు , మూసీ ప్రాజెక్ట్, రాజీవ్ యువ వికాసం తదితర అంశాలపైనా రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications
