"నన్ను చంపేయండి.."- భారతీయ పైలట్ పై దాడి తర్వాత కో పైలట్ అరుపులు..!
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానం (Flydubai Flight) నడుపుతున్న ఒమన్ కు చెందిన మతోన్మాద కో పైలట్ .. పైలట్ పై దాడి చేసి ఫ్లైట్ ను కూల్చేందుకు ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ భయానక దాడి తర్వాత సౌదీ అరేబియాకు విమానాన్ని తీసుకెళ్లి ల్యాండ్ చేశారు. అనంతరం కో పైలట్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో చోటు చేసుకున్న ఘటనల్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ( Netanyahu)వెల్లడించారు.
ఫ్లై దుబాయ్ విమానంలో భారతీయ పైలట్‌పై దాడి ఘటనకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒమన్‌కు చెందిన కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్న అనంతరం అతడు "నన్ను చంపండి.. నన్ను చంపండి" అంటూ అరిచినట్లు నెతన్యాహు వెల్లడించారు. ఈ విమానంలో భారతీయ పైలట్‌పై కో-పైలట్ దాడి చేసినట్లు ఆరోపణలు రావడంతో ప్రయాణికులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కో-పైలట్ చేసిన వ్యాఖ్యలను నెతన్యాహు బయటపెట్టారు.

కో-పైలట్ ఇస్లామిస్ట్ తీవ్రవాదీకరణకు గురయ్యాడని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను దర్యాప్తు అధికారులు ఇంకా స్వతంత్రంగా నిర్ధారించాల్సి ఉంది. ఘటన వెనుక ఉద్దేశం, ఇతరుల ప్రమేయం వంటి అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు దర్యాప్తు తర్వాతే వెల్లడయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఫ్లై దుబాయ్ విమాన ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ముఖ్యంగా 179 మంది ప్రయాణికుల్ని తీసుకెళ్తున్న ఈ విమానంలో పైలట్ పై కో పైలట్ దారుణంగా దాడి చేసిన తర్వాత గాల్లో చోటు చేసుకున్న ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. ఇందులో ముఖ్యంగా 2 నిమిషాల వ్యవధిలో విమానం ఏకంగా 16 వేల నుంచి 17 వేల అడుగులు కిందకు జారిపోయిన ఘటన వింటుంటేనే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఆ విమానంలో ఉన్న ప్రయాణికుల పరిస్ధితి ఆ సమయంలో ఎంత దారుణంగా ఉందో అన్న చర్చ జరుగుతోంది.














Click it and Unblock the Notifications
