హౌతీల దెబ్బకు దిక్కుతోచని సౌదీ ..! సీక్రెట్ గా శత్రుదేశం ఇజ్రాయెల్ వద్దకు.!
ప్రపంచంలోనే అత్యంత సుసంపన్న దేశాల్లో ఒకటైన సౌదీ అరేబియాకు ఇప్పుడు ఎటు చూసినా సమస్యలే కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టగానే .. ఇరాన్ తమపై ప్రతీకార దాడులు ప్రారంభినప్పటి నుంచీ సౌదీకి అన్నీ కష్టాలే. పాకిస్తాన్ తో మక్కా రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నా, తమ దేశంలో ఎవరైనా దాడి చేస్తే పాకిస్తాన్, టర్కీ చేస్తాయని ఆశించినా, ఇప్పుడు యెమెన్ హౌతీల ధాటికి విలవిల్లాడుతోంది. అయినా అటు మిత్రదేశాలైన అమెరికా, బ్రిటన్ కానీ, ఇటు ఒప్పందం చేసుకున్న పాకిస్తాన్, టర్కీ కానీ తోడు రావడం లేదు. దీంతో చివరికి శత్రుదేశం ఇజ్రాయెల్ సాయం కోరుతోంది.
యెమన్‌లోని వ్యూహాత్మక ప్రాంతాలు ఇప్పటికే హుతీ తిరుగుబాటుదారుల వశం కావడంతో గల్ఫ్ దేశమైన సౌదీ అరేబియా (Saudi Arabia) తీవ్ర భౌగోళిక రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. ఎర్ర సముద్ర తీరంతో పాటు అత్యంత కీలకమైన బాబ్ ఎల్-మండేబ్ జలసంధిని హుతీలు స్వాధీనం చేసుకోవడం సౌదీ చమురు ఎగుమతులకు పెద్ద అడ్డంకిగా మారింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో, తమకు దౌత్య సంబంధాలు లేని ఇజ్రాయెల్ నుంచి గూఢచార సమాచారాన్ని పొందేందుకు సౌదీ అరేబియా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు సౌదీ తన సాంప్రదాయ మిత్రదేశాల సాయం కోరినప్పటికీ నిరాశే ఎదురైంది. ముఖ్యంగా మక్కా రక్షణ కూటమిలో భాగస్వామి అయిన పాకిస్తాన్.. యెమన్ సరిహద్దుల్లో పోరాడేందుకు దళాలను పంపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. కేవలం సౌదీ దేశీయ భూభాగ రక్షణకు మాత్రమే తమ సైన్యం పరిమితమవుతుందని తేల్చి చెప్పింది. అమెరికా, బ్రిటన్ దేశాలు సైతం నేరుగా సైనిక దాడులు చేయడానికి సిద్ధంగా లేవు.

దీంతో తీవ్రమైన చమురు దిగ్బంధనాన్ని ఎదుర్కొంటున్న సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, అమెరికా సెంట్రల్ కమాండ్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్‌ను సంప్రదించినట్లు ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. బాబ్ ఎల్-మాండెబ్ జలసంధి రక్షణకు సంబంధించిన ముప్పులపై గూఢచార సమాచార మార్పిడి చేయాలని సౌదీ కోరినట్లు సమాచారం. ఇజ్రాయెల్‌ను ఒక స్వతంత్ర దేశంగా గుర్తించని సౌదీ.. పరోక్షంగానైనా ఈ స్థాయిలో చర్చలు జరపడం అక్కడ నెలకొన్న అసాధారణ పరిస్థితిని తెలియజేస్తోంది. అయితే ఇజ్రాయెల్ సాయం పరిమితంగానే ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఇజ్రాయెల్ ప్రత్యక్షంగా యెమన్‌పై సైనిక చర్యలకు దిగితే, హౌతీ తిరుగుబాటుదారులు తమ నగరాలపై రాకెట్ దాడులు చేసే ప్రమాదం ఉందని ఇజ్రాయెల్ భయపడుతోంది. అందుకే హౌతీల నియంత్రణకు గాను ప్రాంతీయ భాగస్వాములతో కూడిన ఒక విస్తృత అంతర్జాతీయ రక్షణ కూటమి ద్వారా మాత్రమే ముందుకు సాగాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది.














Click it and Unblock the Notifications
