ఆ ఉగ్రవాదిపై 70 లక్షల రివార్డ్ ప్రకటించిన పాకిస్తాన్: కేంద్రం ఘాటుగా రియాక్ట్
అంతర్జాతీయ వేదికలపై తనపై ఉన్న ఉగ్రవాద ముద్రను చెరిపేసుకోవడానికి పాకిస్తాన్ మరోసారి పాత నాటకాన్నే తెర మీదికి తీసుకొచ్చింది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజర్‌పై పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తాజాగా భారీ రివార్డు ప్రకటించింది. అతన్ని పట్టించిన వారికి 70 లక్షల పాకిస్తానీ రూపాయల బహుమతి ఇస్తామని వెల్లడించింది. అతని పేరును రెడ్ బుక్ లో చేర్చింది.
ఈ ఏడాది అక్టోబర్ లో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ప్లీనరీ సమావేశం జరగనున్న నేపథ్యంలో.. పాక్ ఈ తరహా కంటితుడుపు చర్యలకు పాల్పడిందనే విమర్శలు అంతర్జాతీయంగా వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని కేంద్రం సైతం ప్రస్తావించింది. పాకిస్తాన్ వైఖరిని తప్పుపట్టింది. అతను పాకిస్తాన్ లోనే ఉన్నాడని తేల్చి చెప్పింది. మసూద్ అజర్ విషయంలో పాకిస్తాన్ డబుల్ గేమ్ ఆడుతోందంటూ మండిపడింది.

పాకిస్తాన్ దర్యాప్తు సంస్థ ఎఫ్‌ఐఏ ప్రతి అయిదేళ్లకొకసారి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల వివరాలతో ఈ రెడ్ బుక్‌ను విడుదల చేస్తుంది. తాజాగా విడుదల చేసిన జాబితాలో మసూద్ అజహర్ పేరు చేర్చింది. భారత్‌లో జరిగిన పలు ఉగ్రదాడుల వెనుక ప్రధాన సూత్రధారి ఈ మసూద్ అజర్. అతను ప్రస్తుతం తమ దేశంలో లేడని, 2021లోనే ఆఫ్ఘనిస్తాన్‌కు పారిపోయాడంటూ పాకిస్తాన్ చాలా కాలంగా వాదిస్తూ వస్తోంది. తమ దేశంలోనే లేడంటున్న అతనిపై పాక్ దర్యాప్తు సంస్థలు ఇప్పుడు భారీగా రివార్డు ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఉగ్రవాదానికి ఆర్థిక సహాయాన్ని అడ్డుకోవడంలో విఫలమైన దేశాలను ఎఫ్ఏటీఎఫ్.. గ్రే లేదా బ్లాక్ లిస్ట్‌లో ఉంచుతుంది. ఈ జాబితాలో ఉంటే అంతర్జాతీయ బ్యాంకులు గానీ, ఇతర ఆర్థిక సంస్థలు గానీ రుణాలు ఇవ్వవు. గతంలో పాకిస్తాన్ చాలా కాలం పాటు ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లో కొనసాగింది. దాని పర్యవసానంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అక్టోబరులో జరగబోయే కీలక సమావేశానికి ముందు ప్రపంచ దేశాల కళ్లు కప్పి, తాము ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరిస్తున్నామని నిరూపించుకోవడానికే పాక్ ప్రభుత్వం ఈ సరికొత్త నాటకానికి తెరలేపిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
నిజానికి 2021లో కూడా ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్ నుంచి విముక్తి పొందడానికి పాకిస్తాన్ ఇలాంటి ప్రకటనే చేసింది. అప్పట్లో మసూద్ అజహర్ తమ దేశం నుంచి కనిపించకుండా పోయాడని, ఆఫ్ఘనిస్తాన్ వెళ్లాడని బుకాయించిన పాక్.. అప్పట్లో మసూద్ పై 50 లక్షల రూపాయల రివార్డును ప్రకటించింది. ఇప్పుడు అయిదేళ్ల తర్వాత విడుదల చేసిన ఇదే రెడ్ బుక్‌లో ఈ మొత్తాన్ని ఏకంగా 70 లక్షల రూపాయలకు పెంచింది.














Click it and Unblock the Notifications
