చంద్రబాబు ర్యాలీపై హైదరాబాద్ లో కేసు నమోదు..!!
తెలుగుదేశం అధినేత చంద్రబాబు ర్యాలీ పై హైదరాబాద్ లో కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు బేగంపేట పోలీసులు ఈ కేసు నమోదు చేసారు. అనుమతులు లేకుండా ర్యాలీ చేయటంతో ఈ కేసు రిజిస్టర్ అయింది. ఎస్సై జయచందర్ ఫిర్యాదుతో క్రైం నెంబర్ 531/2023 గా కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్ 341,290,21రెడ్ విగ్ 76 సీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేసారు. రెండు గంటల పాటు రోడ్ల పైన ప్రజలను ఇబ్బంది చేసేలా వ్యవహరించారని చంద్రబాబు పై ఫిర్యాదు చేసారు.
టీడీపీ హైదరాబాద్ నగర ప్రధాన కార్యదర్శి జీవీజీ నాయుడు సహా పలువురి పైన కేసులు నమోదు చేసారు. దాదాపు 400 మందితో ర్యాలీలో పాల్గొన్నారని పేర్కొన్నారు. స్కిల్ కేసులో రిమాండ్ లో ఉన్న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఆరోగ్య కారణాల పైన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాల పాటు ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. దీంతో, మంగళవారం సాయంత్రం రాజమండ్రి జైలు నుంచి విడుదలైన చంద్రబాబు భారీ ర్యాలీగా ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. ఆరోగ్య పరీక్షలు..కంటి ఆపరేషన్ కోసం బుధవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో చంద్రబాబు హైదరాబాద్ లోని బేగం పేట విమానాశ్రయానికి చేరారు. అక్కడి నుంచి ర్యాలీగా జూబ్లీహిల్సి నివాసానికి వెళ్లారు.

ఇంటికి వెళ్లే సమయంలో బేగంపేట విమానాశ్రయం నుంచి ర్యాలీగా వెళ్లారు. తెలంగాణలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. బేగంపేట విమానాశ్రయం నుంచి చంద్రబాబు ఇంటి వరకు కాన్వాయ్ ను అనుసరిస్తూ పార్టీ శ్రేణులు జెండాలు..ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఎన్నికల అధికారి అనుమతితోనే ర్యాలీలు చేయాల్సి ఉంటుంది. కోడ్ ఉల్లంఘించేలా వ్యవహరించటంతో ఈ కేసు నమోదు చేసారు. హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారు. నివేదిక ఆధారంగా వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకోనున్నారు. చంద్రబాబు తన కంటికి ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకుంటారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications