టూవీలర్లకు హైదరాబాద్ పోలీసుల గుడ్ న్యూస్
రోడ్డు ప్రమాదాలను నివారించడంలో భాగంగా హైదరాబాద్ నగర పోలీసులు ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. రోడ్డు భద్రత, వాహనాల ప్రమాదాలపై ద్విచక్ర వాహనదారుల్లో అవగాహన కల్పించడం, వారిలో చైతన్యాన్ని తీసుకుని రావడానికి ఉద్దేశించిన కాన్సెప్ట్.. హెల్మెట్ బ్యాంక్. దీని కింద హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలను నడుపుతూ పట్టుబడిన వారికి జరిమానా విధించడంతో పాటు ఉచితంగా హెల్మెట్ ను అందజేస్తారు ట్రాఫిక్ పోలీసులు.
ఈ హెల్మెట్ తీసుకునే ముందు.. తమ ఫోన్ నంబర్, అడ్రస్, ఇతర పూర్తి వివరాలన్నింటినీ కూడా ట్రాఫిక్ పోలీసులకు అందజేయాల్సి ఉంటుంది. అనంతరం 24 గంటల్లో కొత్త హెల్మెట్ ను కొనుగోలు చేయాలి. అనంతరం ఈ పాత హెల్మెట్ ను ట్రాఫిక్ పోలీసులకు తిరిగి ఇవ్వాలి. 24 గంటల్లో ఈ హెల్మెట్ ను తిరిగి ఇవ్వకపోతే వ్యక్తిగత వివరాల ఆధారంగా వారిని ట్రాక్ చేస్తారు. మరోసారి జరిమానా విధించే అవకాశాలు లేకపోలేదు.

మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రస్తుతం ఈ హెల్మెట్ బ్యాంక్ కాన్సెప్ట్ అమలులోకి వచ్చింది. సికింద్రాబాద్ సంగీత్ జంక్షన్ వద్ద ప్రయోగాత్మకంగా దీన్ని ప్రవేశపెట్టారు. ఈ మధ్యాహ్నం ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ బ్యాంక్ ను ప్రారంభించారు. ఇది విజయవంతమైతే మిగిలిన అన్ని పోలీస్ స్టేషన్లల్లో దశలవారీగా అమలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడం, హెల్మెట్ వినియోగంపై ద్విచక్రవాహనదారుల్లో అవగాహనను కల్పించడం వంటివి దీని ముఖ్య ఉద్దేశం.
తొలి రోజే పలువురు ద్విచక్రవాహనదారులకు కొత్త బ్రాండెడ్ హెల్మెట్లను అందజేశారు కూడా. వారి నుంచి పూర్తి వివరాలను సేకరించారు. హెల్మెట్ బ్యాంక్ కాన్సెప్ట్ గురించి వివరించారు. 24 గంటల్లోగా తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుందని, ఈ లోగా కొత్త హెల్మెట్ ను కొనుగోలు చేయాలనీ సూచించారు. హెల్మెట్ లేని వాహనదారుడితో పాటు వెనుక కూర్చున్న వారికీ మోటారు వాహన చట్టం ప్రకారం 200 నుంచి 500 రూపాయల వరకు జరిమానా విధిస్తోన్నారు. ఈ పెనాల్టీ గరిష్టంగా 1,000 రూపాయల వరకు ఉండవచ్చు.












Click it and Unblock the Notifications