తాగునీటితో కారు క్లీనింగ్ చేస్తే.. రూ. 10 వేలు జరిమానా..
హైదరాబాద్ మహానగరంలో నీటి కష్టాలు తప్పడం లేదు. ఓ వైపు నగర జనాభా రోజురోజుకూ పెరిగిపోతున్న క్రమంలో మంచినీటి కోసం నగరవాసులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. నిత్యం భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతూనే ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ వ్యక్తి తాగునీటితో కారును క్లీనింగ్ చేశాడు. దాంతో అధికారులు అతడికి రూ. 10 వేలు జరిమానా విధించారు. ఈ వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
హైదరాబాద్ లో కోటిమందికి పైగా జనాభా ఉన్న విషయం తెలిసిందే. మెట్రో పాలిటన్ సిటీగా, ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ ను నీటి సమస్య వెంటాడుతోంది. అయితే తాజాగా హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవేజ్ బోర్డు(HMWSSB) నగరవ్యాప్తంగా సరఫరా చేసే తాగు నీటిని ఓ వ్యక్తి ఇష్టానుసారంగా కారును క్లీన్ చేసేందుకు వినియోగించాడు. దీంతో ఆగ్రహించిన HMWSSB ఎండీ అశోక్ రెడ్డి అతడిపై రూ. 10 వేలు జరిమానా విధించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన బంజారాహిల్స్ రోడ్ నెం. 12 లో జరిగింది.

బంజారాహిల్స్ రోడ్ నెం. 12 లో HMWSSB ఎండీ అశోక్ రెడ్డి ప్రయాణిస్తుండగా.. ఓ వ్యక్తి HMWSSB సరఫరా చేసే తాగునీటితో కారును క్లీనింగ్ చేయడం గమనించాడు. బెంజ్ కంపెనీకు చెందిన జీ వాగన్ కారును వాషింగ్ చేస్తూ కనిపించాడు. దాంతో తాగునీటిని అలా దుర్వినియోగం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో అతడికి నోటీసులు జారీ చేయాలని HMWSSB ఎండీ అశోక్ రెడ్డి.. సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అతడికి రూ. 10 వేలు జరిమానా విధించాలని ఆదేశించారు. ఇటీవల సెప్టెంబర్ లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఓ వ్యక్తి తన వాహనాలకు తాగునీటితో శుభ్రం చేస్తుంటే అతడికి రూ. 10 వేలు జరిమానా విధించారు. అలాగే సెప్టెంబర్ 18 న ఓ వ్యక్తి ఇంటిపై ట్యాంకు నిండి.. నీరు వృథాగా కిందకు పోతున్న క్రమంలో అతడికి రూ. 5 వేలు జరిమానా విధించారు అధికారులు.












Click it and Unblock the Notifications