ఏపీ, తెలంగాణాలకు సూపర్ న్యూస్.. హుస్సేన్ సాగర్ నుండి ప్రకాశం బ్యారేజ్ వరకు సీప్లేన్స్!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పర్యాటక రంగానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నాయి. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ నుంచి విజయవాడ ప్రకాశం బ్యారేజీ వరకు సీప్లేన్ సేవల ప్రతిపాదన పర్యాటక రంగానికి కొత్త ఊపును ఇవ్వనున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణం ఇప్పుడు రోడ్డు, రైలు, సాధారణ విమానాలకే పరిమితం కాదు. త్వరలో నీటిపైనే టేకాఫ్ అయి గాల్లో ప్రయాణించే సీప్లేన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు సీప్లేన్ నడపాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కలిసి ఆలోచిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత జూలైలో కేంద్ర పౌర విమానయాన మంత్రితో ఈ అంశాన్ని చర్చించారు. దాంతో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం హుస్సేన్ సాగర్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. నీటి లోతు, టేకాఫ్-ల్యాండింగ్‌కు అనువైన ప్రాంతాలు, జెట్టీలు, భద్రతా అంశాలపై సమీక్ష చేసింది.

ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా ఇలాంటి సర్వే జరగనుంది. సీప్లేన్‌లు సాధారణ రన్‌వే అవసరం లేకుండా నీటిపైనే ఎగురుతాయి, దిగుతాయి. వీటిలో 9 నుంచి 12 మంది ప్రయాణికులు సామర్థ్యం ఉంటుంది. హుస్సేన్ సాగర్ నుంచి బయలుదేరితే బుద్ధ విగ్రహం, సచివాలయం, ట్యాంక్‌బండ్ అందాలు ఆకాశం నుంచి కనిపిస్తాయి. హుస్సేన్ సాగర్ నీళ్లపై సీప్లేన్‌లో ఎగిరి.. ప్రకాశం బ్యారేజీలో దిగేలా ప్లాన్ చేస్తున్నారు.
కృష్ణానది మీదుగా ప్రయాణించి, కృష్ణమ్మ అందాలు చూస్తూ ప్రకాశం బ్యారేజీలో దిగొచ్చు. సహజంగా హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళాలంటే రోడ్డు మార్గంలో 5-6 గంటలు, రైలులో 4-5 గంటలు పడుతుంది. కానీ సీప్లేన్‌తో దాదాపు 40-45 నిమిషాల్లో చేరుకోవచ్చు. బిజీగా ఉన్న వ్యాపారులు, పర్యాటకులకు సీ ప్లేన్స్ ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఇంతకు ముందు విజయవాడ-శ్రీశైలం మధ్య సీప్లేన్ ప్రదర్శన జరిగింది.
ఈ కొత్త రూట్ రెండు తెలుగు రాష్ట్రాల పర్యాటకాన్ని బలోపేతం చేస్తుంది. పర్యావరణ అనుమతులు, భద్రతా ప్రమాణాలు, నీటి స్థాయి వంటి అంశాలపై ఇంకా అధ్యయనం కొనసాగుతోంది. ప్రతిపాదన కార్యరూపం దాల్చితే పర్యాటకులకు కొత్త అనుభూతి లభిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పర్యాటక సర్క్యూట్ బలపడుతుంది.












Click it and Unblock the Notifications
