మెట్రో రైళ్ళపై హైదరాబాదీల డిమాండ్ ఇదే.. సాధ్యమవుతుందా?
హైదరాబాద్ నగరవాసులు మెట్రో సేవల పైన తమ కొత్త కోరికను వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళ సందడిగా ఉండే హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైళ్ళవేళలు పెంచాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. నైట్ ఎకానమీని ప్రోత్సహించాలి అంటే ముందుగా రాత్రిపూట ప్రయాణం విస్తృతం చేయాలని ఇటు రవాణారంగ నిపుణులు కూడా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు హైదరాబాద్ నగరవాసులు మెట్రో సేవలను రాత్రివేళ పెంచాలని కోరుతున్నారు? దీని వెనుక కారణం ఏమిటి అంటే..
కుదించిన మెట్రో రైళ్ళ సేవల సమయాలు
గతంలో హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు వేళలు రాత్రి 11 గంటల 45 నిమిషాల వరకు అందుబాటులో ఉండేవి. గత నెల నుంచి రాత్రి 11 గంటలకే మెట్రో రైలు సేవల వేళలను కుదించారు. దీంతో ఇప్పుడు నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. రాత్రి 11 దాటితే రవాణా సదుపాయాలు లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మెట్రో సేవల సమయం తగ్గితే ఇబ్బందులు ఇవే
ఉద్యోగాలు, వ్యాపారాలు ముగించుకొని ఇంటికి చేరుకోవడానికి మెట్రో పైన ఆధారపడే చాలామంది రాత్రి 11 గంటల తర్వాత మెట్రో లేకపోవడంతో సురక్షితంగా ప్రయాణం చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మెట్రో ఛార్జీలు కూడా తక్కువగా ఉండటంతో ఆర్థిక భారం కూడా తగ్గుతుందని, సేఫ్ గా ఇంటికి వెళ్లడానికి అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నైట్ ఎకానమీపై ప్రశ్నిస్తున్న సిటీ జనాలు
ఒకపక్క దేశంలో నైట్ ఎకానమీని ప్రోత్సహించాలని ప్రభుత్వాలు భావిస్తుంటే, హైదరాబాద్లో నైట్ మెట్రో రైళ్ల సేవలను తగ్గించడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో రాత్రి 11:30 గంటల వరకు, ముంబైలో రాత్రి 11 గంటల యాభై నిమిషాల వరకు మెట్రో నడుస్తుందని, హైదరాబాద్ లో ఎందుకు మెట్రో సమయాన్ని తగ్గించారని ప్రశ్నిస్తున్నారు.
మెట్రో వర్గాల అభిప్రాయం ఇదే
అయితే నిర్వహణ వ్యయం పెరుగుతున్న కారణంగానే, తక్కువ మంది ప్రయాణికులకు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది అన్న కారణంగానే మెట్రో రైలు సేవల సమయాన్ని కుదించినట్లు మెట్రో వర్గాలు చెబుతున్నాయి. కానీ ప్రజల భద్రతకు ప్రాధాన్యత నిచ్చి మెట్రో రైలు సేవలను పెంచాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
ప్రయాణికుల ప్రధాన డిమాండ్ ఇదే
మెట్రో ఎనిమిది సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన సర్వేలో కూడా మెట్రో రైలు సేవల వేళలు పొడిగించాలని ప్రయాణికులు ప్రధానంగా కోరుతున్నారు. మరి ప్రయాణికుల డిమాండ్ ను అర్థం చేసుకొని మెట్రో రైలు సేవల సమయాన్ని పొడిగిస్తారా లేదా అనేది ముందు ముందు తెలియనుంది.












Click it and Unblock the Notifications