మళ్లీ రంగంలోకి హైడ్రా: ఆక్రమణల తొలగింపునకు రంగనాథ్ గ్యారంటీ
హైదరాబాద్ నగరంలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు కాస్త విరామం ఇచ్చిన హైడ్రా.. ఇప్పుడు మరోసారి రంగంలోకి దిగుతోంది. చెరువుల ఆక్రమణలను తొలగించేందుకు సిద్ధమైంది. తాజాగా, హైడ్రా కమిషనర్ రంగనాథ్ నగరంలోని పలు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు. స్థానికుల నుంచి ఫిర్యాదులు అందడంతో చెరువుల పునరుద్ధరణు ఆదేశాలు జారీ చేశారు.
చెరువుల వద్ద ఆక్రమణలను తొలగించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగించేలా అభివృద్ధి చేస్తామని రంగనాథ్ స్తానికులకు హామీ ఇచ్చారు. బాచుపల్లిలోని ఎర్రకుంట చెరువును పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని పునరుద్దరణ చర్యలు మొదలుపెట్టనున్నట్లు రంగనాథ్ తెలిపారు.

చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణ కోసం హైడ్రా ఏర్పాటు పట్ల హైకోర్టు సానుకూలత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా బాచుపల్లిలోని ఎర్రకుంట చెరువును పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకున్నారు. ఆ చెరువులోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసి వ్యర్థాలను తొలగించిన హైడ్రా అక్కడ తదుపరి కార్యాచరణను మొదలుపెట్టింది.
ఆ ప్రాంతాన్ని రంగనాథ్ మరోసారి సందర్శించి అక్కడ చేయాల్సిన అభివృద్ధిపై స్థానికులు, అధికారులతో చర్చించారు. అలాగే స్థానికుల ఆహ్వానం మేరకు బండారి లేఔట్‌ను సందర్శించారు. ఇక, సమీపంలోని తుర్కచెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువులో ఆక్రమణలతోపాటు కలుషితనీరు కలుస్తుందని స్థానికులు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో తుర్కచెరువు అభివృద్ధి కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామని రంగనాథ్ తెలిపారు. మాదాపూర్‌లోని మేడి కుంట చెరువు, ఈదులకుంట, నార్సింగ్ లోని నెక్నాంపూర్ చెరువు, తెల్లాపూర్‌లోని వనం చెరువు, చెల్లికుంట, మేళ్ల చెరువులను పరిశీలించిన రంగనాథ్.. ఈ సందర్భంగా స్థానికులు ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. .
ఈ క్రమంలో ఈదులకుంట చెరువు ఏ మండలం పరిధిలోకి వస్తుంది? ఓవర్ ల్యాపింగ్ ఎలా అయింది? గతంలో చేసిన సర్వే వివరాలు ఏంటి? రికార్డులు ఎక్కడున్నాయంటూ కూకట్ పల్లి, శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులను రంగనాథ్ ప్రశ్నించారు. గతంలో సర్వే చేసిన రిపోర్టులను పునఃపరిశీలించారు. ఈదులకుంట చెరువు ఆక్రమణలను తక్షణమే తొలగిస్తామని, ఆ చెరువు పునరుద్దరణకు అన్ని చర్యలు చేపడతామని స్థానికులకు హామీ ఇచ్చారు రంగనాథ్.












Click it and Unblock the Notifications