శభాష్ "హైడ్రా" .. రూ.139 కోట్ల భూమికి విముక్తి !
హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైడ్రా టీమ్ విజయవంతంగా పని చేస్తోంది. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై కొరడా ఝుళిపిస్తూ హైడ్రా దూసుకుపోతోంది. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని.. ఫీల్డ్‌లోకి దిగి తక్షణ చర్యలు చేపడుతోంది. ఎక్కడ సమస్య ఉందో అక్కడే ప్రత్యక్షమై, యాక్షన్ మొదలు పెడుతూ ఆక్రమణలకు గురైన భూములకు విముక్తి కలిగిస్తోంది.
రాజేంద్రనగర్‌లో భారీ ఆపరేషన్..
హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పరిధిలోని బద్వేల్, ఉప్పరపల్లి గ్రామాల్లో హైడ్రా బృందం పెద్ద ఎత్తున ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టింది. జనచైతన్య లేఔట్ ఫేజ్ 1, 2 ప్రాంతాల్లో కబ్జాకు గురైన నాలుగు పార్కులకు విముక్తి కల్పించింది. ఈ ఆపరేషన్‌లో సుమారు 19,878 గజాల భూమి ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. దీని మార్కెట్ విలువ రూ.139 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

హుడా అప్రూవల్ పేరుతో మోసం..
కాగా దాదాపు 120 ఎకరాల పరిధిలో ఏర్పాటైన ఈ లేఔట్‌లో కొంతమంది రియల్టర్లు హుడా అప్రూవల్ పేరుతో ప్లాట్లు విక్రయిస్తూ.. పార్కులను కూడా కబ్జా చేశారని సమాచారం. ఈ మేరకు స్థానికులు హైడ్రా హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి కబ్జాలు జరిగినట్లు నిర్ధారించారు.
ఈ క్రమంలోనే హైడ్రా బృందం ఈరోజు ( అక్టోబర్ 15, 2025 ) తెల్లవారుజామున భారీ సిబ్బంది, యంత్రాలతో రంగంలోకి దిగింది. ఆక్రమణదారులు నిర్మించిన ప్రహరీలు, షెడ్‌లు, రూమ్‌లను కూల్చివేసి.. పార్కులకు విముక్తి కల్పించారు. అనంతరం ఆ భూముల చుట్టూ ఫెన్సింగ్ పనులు ప్రారంభించి.. భవిష్యత్తులో మరోసారి ఎవరూ కబ్జా చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక హైడ్రా చర్యల పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సంవత్సరాలుగా తమ పిల్లలకు ఆడుకునే పార్కులు లేకుండా పోయాయని.. హైడ్రా జోక్యంతో భూములకు విముక్తి కలిగిందని చెబుతున్నారు. ప్రభుత్వ భూములపై, చెరువుల చుట్టూ లేదా పార్కులలో ఎవరైనా ఆక్రమణకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications