హైడ్రా తాజా కూల్చివేతలు- కొత్త ఏడాది వేళా..
HYDRA: రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతున్న పేరు.. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. సింపుల్‌గా చెప్పాలంటే హైడ్రా. అక్రమార్కుల గుండెల్లో రైళ్లను పరుగెత్తిస్తోంది వ్యవస్థ. చెరువులు, కుంటలను కబ్జా చేసి కట్టిన భారీ బిల్డింగులు, అపార్ట్‌మెంట్లను సైతం నేలమట్టం చేస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్‌లల్లో ఆక్రమణకు గురైన చెరువులను పరిరక్షించడం, వాటిల్లో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి ప్రత్యేకంగా హైడ్రా వ్యవస్థను తెరమీదికి తీసుకొచ్చింది తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దీనికి అదనంగా మూడువేల మంది సిబ్బందినీ దీనికి కేటాయించింది.

ఇప్పటివరకు ఆక్రమణలకు గురైన మీరాలం, బమ్ రుక్ ఉద్ దౌలా, మాదాపూర్ తమ్మిడికుంట వంటి ఎనిమిది చెరువులు, 12 పార్కుల భూములను కాపాడింది హైడ్రా. ఆయా చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్‌లల్లో నిర్మితమైన కట్టడాలను కూల్చివేసింది. ఆ స్థలాలకు విముక్తి కల్పించింది.
ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లల్లో అక్రమ నిర్మాణాల వల్ల సంభవించే నష్టాలపై ప్రజల్లో అవగాహన సైతం కల్పించనుంది. 1,025 చెరువులకు హద్దులను నిర్ణయించబోతోంది. ఈ హద్దులు మీరి నిర్మించిన ఇళ్లు, భవనాలు, అపార్ట్‌మెంట్లపై కొరడా ఝుళిపించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ క్రమంలో తాజాగా రాయదుర్గం పరిధిలోని ఖాజాగూడ భగీరథమ్మ చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మించిన ఇళ్లు, దుకాణాలను తొలగించింది హైడ్రా. ఈ ఉదయం నుంచే అక్కడ తొలగింపు పనులు మొదలయ్యాయి. బఫర్ జోన్ ప్రాంతంలో వేసిన ఫెన్సింగ్‌ను అధికారులు తొలగించారు. అక్కడ అక్రమంగా వెలిసిన 20 దుకాణాలను జేసీబీలతో కూల్చివేశారు.

ఈ తొలగింపు వల్ల దుకాణదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ సామాన్లను తీసుకుని రోడ్డు పక్కన బైఠాయించారు. దుకాణాలను తొలగించాలంటూ ఒక్క రోజు ముందు నోటీసులు ఇచ్చారని వాపోయారు. తమకు ప్రత్యామ్నాయాన్ని చూపాలంటూ మహిళలు కన్నీరు మున్నీరు అయ్యారు. నిలువ నీడను కోల్పోయామని, పిల్లలను వెంటబెట్టుకుని ఎక్కడికెళ్లాలంటూ విలపించారు.
ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. భగీరథమ్మ చెరువు వద్ద పెద్ద ఎత్తున బలాగాలను మోహరింపజేశారు. దుకాణల్లో అమ్మకానికి ఉంచిన సామాగ్రిని బయటికి చేర్చిన తరువాత వాటిని కూల్చివేశారు.












Click it and Unblock the Notifications