రాజీనామా చేసి వెళ్లిపోతా..
KTR: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. వాడివేడిగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పరం మాటల యుద్ధానికి దిగుతున్నారు. విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణాస్త్రాలను సంధించుకుంటోన్నారు. గతాన్ని తవ్వి తీస్తోన్నారు. ఒకరి పరిపాలనలోని లోపాలను మరొకరు బయటికి తీస్తోన్నారు.
ఈ క్రమంలో- భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్.. అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. నిరుద్యోగులు, ఉద్యోగాల కల్పన విషయంలో ఛాలెంజ్ చేశారాయన.

కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగాల కల్పన అంశంపై కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిది నెలల కాలంలో కొత్తగా ఒక్క ఉద్యోగం అయినా కల్పించిందా? అంటూ అధికార పక్షాన్ని నిలదీశారు. ఎన్నికల ప్రచార సమయంలో నిరుద్యోగులకు ఎన్నో హామీలను ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు ఒక్కటి కూడా అమలు చేయలేకపోతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన తరువాత తామిద్దరం కలిసి అశోక్ నగర్ వెళ్దామని, ఎలాంటి భద్రత లేకుండా ఓ సామన్య పౌరుల్లా అక్కడికి వెళ్లి నిరుద్యోగులతో మాట్లాడదామని ఆహ్వానించారు.
అశోక్ నగర్‌లో వివిధ కోర్సులు, కాంపిటీటివ్ పరీక్షల కోసం సిద్ధపడుతున్న ఏ నిరుద్యోగి అయినా.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం కల్పించినట్లు చెబితే- తాను అక్కడికక్కడే తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతానని కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఒక్క ఉద్యోగం ఇప్చించినట్టు తేలితే చాలని తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టం చేశారు.
ఒక్క ఉద్యోగం ఇప్పించినట్లు తేలినా.. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కకు లక్షమందితో సిటీ సెంట్రల్ లైబ్రరీలో పౌర సన్మానం చేయిస్తానని, దీనికి అయ్యే ఖర్చును బీఆర్ఎస్ భరిస్తుందని కేటీఆర్ అన్నారు.












Click it and Unblock the Notifications