అదే నా రాజకీయ వ్యూహం, రేవంత్ కూడా: సంచలన ప్రకటనపై జగ్గారెడ్డి ఏమన్నారంటే.?
హైదరాబాద్: తాన ఏం మాట్లాడినా పార్టీ మంచి కోసమేనంటూ సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. రాజకీయంలో అనేక ఎత్తుగడలు, వ్యూహాలు ఉంటాయని చెప్పారు. రాజకీయ వ్యూహంలో భాగంగానే టీఆర్ఎస్, బీజేపీలు పోటాపోటీగా సభలు నిర్వహించి ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‍లోని గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీని వీడేది లేదన్న జగ్గారెడ్డి
తాను కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. సోనియా, రాహుల్ గాంధీ నాయకత్వంలోనే పనిచేస్తానని స్పష్టం చేశారు జగ్గారెడ్డి. రాజకీయ రణరంగంలో అనేక వ్యూహాలు ఉంటాయని పేర్కొన్నారు. తాను ఏది మాట్లాడినా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే మాట్లాడతానని వెల్లడించారు. అప్పట్లో రాష్ట్ర విభజనను తాను ఒక్కడినే వ్యతిరేకించినట్లు చెప్పారు. సంగారెడ్డికి కేసీఆర్ రావొద్దని ధర్నాలు చేసినట్లు తెలిపారు.

ఇదే నా రాజకీయ వ్యూహమంటూ సంచలన ప్రకటనపై జగ్గారెడ్డి
రాజకీయంలో అనేక వ్యూహాలుంటాయని, ఇదొక వ్యూహం అనుకోండి అని అన్నారు. మూడు రోజులపాటు బీజేపీ సమావేశాలను టీవీల్లో చూపారు. ఆ రోజే రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను కేసీఆర్ ఆహ్వానించడం అంతా ఒక వ్యూహం. వారు కూడా మీడియాలో వచ్చారు. తాము ప్రజల కోసం ఎంత పనిచేస్తున్నా.. మమ్మల్ని గుర్తస్తలేరు.
బీజేపీది ఎత్తుగడ.. కేసీఆర్ ది ఎత్తుగడ.. నా వ్యాఖ్యలు కూడా రాజకీయ వ్యూహంలో మరో ఎత్తుగడే అని జగ్గారెడ్డి చెప్పారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కూడా ఎత్తుగడలో భాగమేనన్నారు. అందుకే మీడియా తమవైపు తిరిగిందని చెప్పారు. తాను రేపు సంచలన ప్రకటన చేస్తానంటూ ఆదివారం జగ్గారెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపైనే ఆయన వివరణ ఇచ్చారు.

ఎవరికీ భయపడను.. అందరితో కలిసి పనిచేస్తానన్న జగ్గారెడ్డి
తాను పార్టీ నుంచి పోవాలనుకుంటే తనను ఆపేదెవరని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కొన్ని ప్రచార మాధ్యమాల్లో తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. అందుకే వాటిపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తనకు ఉందన్నారు. త్వరలొనే మళ్లీ అన్ని విషయాలు మాట్లాడతానని చెప్పారు. తాను ఎవ్వరికి భయపడనని.. తాను అనుకున్నదే మాట్లాడతానని జగ్గారెడ్డి వివరించారు. కాంగ్రెస్ పార్టీ కోసమే తాను అందరితో కలిసి పనిచేస్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications