కేసీఆర్ సర్కార్ ఒప్పందాలను తవ్వుతున్న రేవంత్: ఆ సీనియర్ ఐఎఎస్‌కు మెమొ: ఆట షురూ
Formula E: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో ఏర్పాటైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గేర్ మార్చింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఒప్పందాలపై దృష్టి సారించింది. అవకతవకలు చోటు చేసుకున్నట్లుగా అనుమానించిన ప్రతి ఒప్పందంపైనా ఆరా తీయడం మొదలు పెట్టింది.
ఈ క్రమంలో ఫార్ములా-ఇ రేస్ అగ్రిమెంట్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇదివరకే రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇది అక్కడితో ఆగట్లేదు. మరో అడుగు ముందుకు పడింది. అగ్రిమెంట్లల్లో ఉన్న లోపాలపై విచారణను చేపట్టింది. ఫార్ములా-ఇ రేసును నిర్వహించడానికి ఏకంగా 46 కోట్ల రూపాయల మొత్తాన్ని హెచ్‌ఎండీఏకు ఎందుకు మంజూరు చేయాల్సి వచ్చిందనే విషయంపై ఆరా తీస్తోంది ప్రభుత్వం.

ట్యాక్స్ మొత్తాన్ని కూడా కలుపుకొంటే మరో తొమ్మిది కోట్ల రూపాయలు దీనికి అదనం. ఫార్ములా ఇ రేస్ నిర్వాహకులతో ఒప్పందాలు కూడా కుదరకముందే, హెచ్‌ఎండీఏ డైరెక్టర్ల బోర్డు ఆమోదం పొందకుండానే ఇన్ని కోట్ల రూపాయల మొత్తాన్ని హెచ్‌ఎండీఏకు బదలాయించడాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది.
ఈ నేపథ్యంలో హెచ్‌ఎండీఏ మాజీ కమిషనర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌కు మెమొను జారీ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మెమొ నంబర్ 350/స్పెషల్ సీ/ఏ2/2023ని ఆయనకు పంపించారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని సూచించారు. అరవింద్ కుమార్ హెచ్ఎండీఏ కమిషనర్‌గా ఉన్నప్పుడే ఈ ఒప్పందాలు కుదిరాయని చెబుతున్నారు.

2022లో తెలంగాణ ప్రభుత్వం ఎఫ్ఐఏ ఫార్ములా-ఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ప్రతినిధులతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఎలక్ట్రిక్ కార్ల రేసింగ్ ఇది. న్యూయార్క్, లండన్, బెర్లిన్, రోమ్, సియోల్‌లల్లో మాత్రమే ఈ ఫార్ములా-ఈ రేసింగులు సాగుతున్నాయి. వాటి సరసన హైదరాబాద్‌ను కూడా చేర్చాలనే ఉద్దేశంతో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఈ రేస్‌కు ఆతిథ్యాన్ని ఇచ్చింది.
గత ఏడాది ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఈ రేస్ నిర్వహించారు. మలి విడతలో ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన దీన్ని జరపాల్సి ఉంది. ఈ లోగా- ఆర్థిక అవకతవకలను చోటు చేసుకున్నట్లుగా భావించడంతో ఈ ఒప్పందాలన్నింటినీ రద్దు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. విచారణకు ఆదేశించింది.












Click it and Unblock the Notifications