Manchireddy Kishanreddy: ఈడీ విచారణకు హాజరైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి..
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈడీ ఆఫీసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని అధికారులు ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన క్యాసినో కేసులో టీఆర్ఎస్ నేత, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో చీకోటి ప్రవీణ్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసి విచారించారు.

విదేశాలకు వెళ్లి కేసినో
మంచిరెడ్డి కిషన్ రెడ్డి గతంలో విదేశాలకు వెళ్లి కేసినో ఆడారని.. హవాలా, మనీలాండరింగ్ ద్వారా డబ్బు బదిలీ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే మంచిరెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. చీకోటి ప్రవీణ్ విచారణలో వెలుగు చూసిన అంశాల ఆధారంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏడుగురు రాజకీయ నేతలకు ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు.

ఏడుగురికి
ఈ ఏడుగురికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ నోటీసులు అందుకున్న వారిలో మంచిరెడ్డి కూడా ఉన్నారు. ఈ నోటీసుల ఆధారంగానే ఆయన మంగళవారం ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరైనట్లు తెలుస్తోంది. ఆయన ఫెమా నిబంధనలను ఉల్లంఘించారని కూడా ఈడీ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. మంచిరెడ్ది నుంచి ఈడీ అధికారులు స్టేట్ మెంట్ నమోదు చేస్తున్నట్లు సమాచారం.

అరెస్ట్ చేయాలి
మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన మంచిరెడ్డి కిషన్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇంఛార్జ్ మల్ రెడ్డి రంగారెడ్డి డిమాండ్ చేశారు. భూ కబ్జాలు, కేసినో, జూదంలో నిందితుడిగా ఉన్న మంచిరెడ్డి కిషన్ రెడ్డిని వెంటనే విచారించాలన్నారు. తెరాస ప్రభుత్వం తక్షణమే ఎమ్మెల్యేని బర్తరఫ్ చేయించాలని డిమాంట్ చేశారు. ఇప్పటికే ఎన్నో సార్లు అతనిపై ఆరోపణలు వచ్చాయని మల్ రెడ్డి రంగారెడ్డి గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications