మళ్ళీ కారు దూసుకుపోతే కేసీఆర్ కొత్త హిస్టరీ సృష్టిస్తాడు.. అదేమిటో తెలుసా!!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొనగా.. ఎవరికివారు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ళ తరువాత గెలిచి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ఆరాట పడుతుంటే... గెలిచి చరిత్ర సృష్టించాలని అధికార బిఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తోంది.
దీంతో పార్టీ గెలుపు కోసం బిఆర్ఎస్ పార్టీ తన సర్వశక్తుల్ని ఒడ్డుతోంది. ఒకవేళ ఈసారి గనక బీఆర్ఎస్ గెలిస్తే దక్షిణ భారతదేశం లో హ్యాట్రిక్ సిఎంగా కేసీఆర్ సరికొత్త చరిత్రను లిఖించినట్లవుతుంది. ఇప్పటికే ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలలో పలువురు సిఎంలు హ్యాట్రిక్ నమోదు చేయగా దక్షిణాదిలో మాత్రమే ఆ ఫీట్ ను ఎవరూ సాధించలేకపోయారు.

దక్షిణాదిలో ఇప్పటి వరకు చాలా మంది వరుసగా రెండుసార్లు లేదా ఎక్కువ కాలం సీఎంలుగా పని చేసిన ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ వరుసగా హ్యాట్రిక్ సీఎం గా పని చేసిన వారు ఎవరూ లేకపోవడంతో తెలంగాణా సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దృష్టి హ్యాట్రిక్ మీద పడింది. దీంతో ఈ ఎన్నికలను కేసీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
ఎలాగైనా గెలిచి పార్టీని అధికారం లోకి తీసుకు రావడంతో పాటు, దక్షిణాదిలో ఎవరకీ సాధ్యం కాని హ్యాట్రిక్ ఫీట్ సాధించవచ్చని భావిస్తున్నారు.. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు, వైయస్ రాజశేఖర్ రెడ్డి తోపాటు తమిళనాడు లో జయలలిత, కరుణానిధి వంటి నేతలు హ్యాట్రిక్ సాధిస్తారనే నమ్మకం ఉండేది. కానీ కారణాలు ఏవైనా వారు కూడా ఆ హ్యాట్రిక్ ఫీట్ సాధించలేక పోయారు.
ప్రస్తుత తెలంగాణ సిఎం కెసిఆర్ వరుసగా రెండు పర్యాయాలు సిఎంగా పనిచేసి ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ సారి కూడా ప్రజాతీర్పు ఆయనకు అనుకూలంగా వస్తే 3వసారి సిఎంగా ఎన్నికై హ్యాట్రిక్ సిఎంగా రికార్డు సృష్టించనున్నారు. దీంతో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 5రాష్ట్రాలలో ముఖ్యమంత్రి కెసిఆరే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications