హైదరాబాద్ కు భారీ అలర్ట్ - ఐటీ ఉద్యోగులకు లాగౌట్ వార్నింగ్..!!
హైదరాబాద్ లో మరోసారి కుండపోత కురవనుంది. వాతావరణ శాఖ తాజా హెచ్చరిక చేసింది. నగరంలో సాయంత్రం సమయంలో కురుస్తున్న వర్షంతో సిటీ అంతా జలదిగ్భంధంలో చిక్కుకుంటోంది. మంగళవారం సాయంత్రం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు ఐటీ ఉద్యోగులకు లాగ్ ఔట్ వార్నింగ్ ఇచ్చారు. సాయంత్రం షిఫ్ట్ ఉద్యోగులు.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే బెటర్ అని సూచించారు.
హైదరాబాద్ లో మరి కొద్ది సేపట్లో భారీ వర్షం పొంచి ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం ఈదురుగాలులతోపాటు.. కుండపోత వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాత్రి 11గంటల వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇదే సమయంలో ట్రాఫిక్ పోలీసులు కీలక సూచన చేసారు. భారీ వర్షాల నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు సాధ్యమైనంత వరకు తమ కార్యకలాపాలను మధ్యాహ్నం 3 గంటలకే లాగ్ఔట్ చేయాలని ఆదేశించారు. ఇక సాయంత్రం షిఫ్ట్ ఉద్యోగులు.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే బెటర్ అని సూచించారు.

భారీ వర్షాల వేళ నగరంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. మాదాపూర్, కొండాపూర్, హైటెక్‌సిటీ, గచ్చిబౌలితో పాటు పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో రోడ్లపైనే ప్రయాణికులు, ఉద్యోగులు, వాహనదారులు గంటల తరబడి ఉండాల్సి వస్తుంది. కొన్ని చోట్ల అయితే వాహనాలు నీట మునిగి ముందుకు కదల్లేని పరిస్థితి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఐటీ ఉద్యోగులు సహకరించాలని పోలీసులు కోరారు. సాయంత్రం లోగా ప్రతి ఉద్యోగి తమ ఇండ్లకు చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలని సైబరాబాద్ పోలీసులు కోరుతున్నారు. వచ్చే రెండు రోజులు కూడా హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తాయని జీహెచ్ఎంసీ పేర్కొంది.. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అలర్ట్ జారీ చేసింది.












Click it and Unblock the Notifications