తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్!
ఒకపక్క ఎండలు నిప్పులు చెరుగుతుంటే, మరోవైపు వర్షాలు కూడా రాష్ట్రంలో కురుస్తున్న పరిస్థితి ఉంది. ఇక తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ మరోమారు తెలంగాణ ప్రజలకు చల్లని కబురు తీసుకొచ్చింది. రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
వర్షాలపై కీలక అలెర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మార్చి 30వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

బలమైన ఈదురుగాలులు, పిడుగులతో వర్షం
వర్షాలతో పాటు గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని ప్రాంతాలలో పిడుగులు పడే అవకాశం కూడా ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
ఈ జిల్లాలలో వర్షాలకు ఛాన్స్
ముఖ్యంగా తెలంగాణలోని వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబాబాద్, సూర్యపేట, నల్గొండ, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల , కొమరం భీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, మల్కాజ్గిరి, ములుగు భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, ఖమ్మం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలపైన ఈ వర్షాల ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఈ జిల్లాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణకేంద్రం వెల్లడించింది.
హైదరాబాద్ లో వర్షం
మరోవైపు నేడు హైదరాబాద్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుందని, ఈరోజు సాయంత్రం లేదా రాత్రి వేళల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. ఇక నిన్న సాయంత్రం హైదరాబాద్లో పలు ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. నేడు సాయంత్రం కూడా హైదరాబాదులో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
రైతులకు వాతావరణ శాఖ అలెర్ట్
పగలంతా ఎండతో, తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న వారికి సాయంత్రం కురుస్తున్న వర్షాలు కాస్త ఉపశమనాన్ని ఇస్తాయని భావిస్తున్నారు. అయితే అకాల వర్షాల కారణంగా రైతన్నలు మాత్రం కాస్త ఇబ్బంది పడుతున్నారు. వాతావరణ శాఖాధికారులు వర్షాలు పడే జిల్లాల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications