Weather: తెలంగాణలో పలు జిల్లాల్లో వడగాలులు, అత్యధిక ఉష్ణోగ్రతలు, ప్రజలకు అలర్ట్
హైదరాబాద్: గత కొన్ని రోజులుగా తెలంగాణలో నైరుతి రుతుపవనాల కదలికల నేపథ్యంలో కురిసిన వర్షాలు ఉపశమనం కలిగించగా.. తాజాగా మరోసారి రాష్ట్ర ప్రజలు వేడిగాలులను చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండ వేడిమికి తాత్కాలిక ఉపశమనం తర్వాత, తెలంగాణలోని వివిధ జిల్లాల్లో శనివారం వేడిగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాలు, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో శుక్రవారం కూడా వేడిగాలులు వీచాయి.

గరిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు 43°C నుంచి 46°C వరకు ఉండే అవకాశం ఉంది. జూన్ 4న కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.
శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య ఎవరూ బయటకు వెళ్లవద్దని ఐఎండీ ప్రజలకు సూచించింది. కాగా, మరో వారం రోజుల్లో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపిన విషయం తెలిసిందే. దీంతో మరికొన్ని రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇది ఇలావుండగా, దేశ రాజధాని ఢిల్లీతోపాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇటీవల కురిసిన వర్షాలకు ఉపశమనం పొందిన ప్రజలకు మరోసారి ఎండవేడిమి తగలనుంది. బయటికి వెళ్లిన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు వాతావరణ శాఖ సూచించింది.












Click it and Unblock the Notifications