మంత్రుల భార్యలకూ ఇందిరమ్మ చీరలు ? రేవంత్ రెడ్డి రిప్లైకి నవ్వుల జల్లు..!
తెలంగాణ ప్రభుత్వం ఇవాళ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలో కోటి మంది మహిళలకు చీరలు పంచుతోంది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి.. తన కేబినెట్ మంత్రులతో కలిసి ప్రారంభించారు. నెక్లెస్ రోడ్ లో ముందుగా ఇందిరమ్మ విగ్రహానికి నివాళులు అర్పించిన సీఎం, మంత్రులు.. అనంతరం ఈ కార్యక్రమంలో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చివర్లో సీఎం, మంత్రుల మధ్య ఆసక్తికర సంవాదం చోటు చేసుకుంది.
ఇవాళ ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, దామోదర్ రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముగిశాక రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం రేవంత్ రెడ్డిని ఇందిరమ్మ చీరలు మంత్రుల భార్యలకు కూడా ఇస్తారా అని ఆయన్ను సరదాగా ప్రశ్నించారు. దీంతో ఇతర మంత్రులూ స్పందించారు.

పొన్నం ప్రభాకర్ ప్రశ్నకు సమాధానమిస్తూ సీఎం రేవంత్ రెడ్డి.. ముందు మంత్రుల భార్యలకు చీరలు ఇవ్వట్లేదన్నారు. మంత్రుల భార్యలకు చీరలిస్తే మీరు కట్టుకునేలా ఉన్నారంటూ వారిని ఉద్ధేశించి సీఎం సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్న మంత్రులంతా నవ్వుల్లో మునిగిపోయారు. మంత్రి సీతక్క సీఎం, ఇతర మంత్రుల కుటుంబాలకు కూడా చీరలు ఇస్తానంటే తనకు అభ్యంతరం లేదంటూ కూడా రేవంత్ రెడ్డి మరో సూచన చేశారు. దీంతో మంత్రులు దీనిపై ఆసక్తికరంగా చర్చించుకోవడం కనిపించింది.












Click it and Unblock the Notifications