ఇందిరమ్మ టవర్స్ నిర్మాణంపై కీలక ఆదేశాలిచ్చిన మంత్రి పొంగులేటి!
తెలంగాణలో పేదలకు సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో మరో కీలక అడుగు పడింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన భూములు గుర్తించాలని స్పష్టంగా ఆదేశించారు.
క్యూర్ పరిధిలో మూడు విడతల్లో లక్ష ఇందిరమ్మ ఫ్లాట్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి విడతతో పాటు రెండో, మూడో విడతల నిర్మాణాలకు కూడా అవసరమైన భూములను వెంటనే గుర్తించాలని మంత్రి సూచించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని, ఎంపికను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

లాటరీ ప్రక్రియను యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని కూడా చెప్పారు. దీనివల్ల ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఇందిరమ్మ టవర్స్ నగరం లోపలే, లబ్ధిదారులు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు దగ్గరగా నిర్మించబడుతున్నాయి. గతంలో పేదలకు దూర ప్రాంతాల్లో ఇళ్లు కేటాయించే పద్ధతిని మార్చి, ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా నగరంలోనే సౌకర్యవంతమైన ఫ్లాట్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రతి ఫ్లాట్‌కు లబ్ధిదారులకు పూర్తి హక్కులు, భూమి వాటా కల్పించి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేకుండా సేల్ డీడ్ అందించనున్నారు. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి సుమారు 500 ఇళ్లు నిర్మించే ప్రణాళిక ఉంది. కొన్ని చోట్ల ఇప్పటికే శంకుస్థాపనలు జరిగాయి. నాంపల్లి, రాయదుర్గ్, పోచారం వంటి ప్రాంతాల్లో పనులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ఒక్కో ఫ్లాట్‌కు సబ్సిడీ అందిస్తుండగా, లబ్ధిదారులు కొంత మొత్తం వాయిదాల వారీగా చెల్లించాల్సి ఉంటుంది.
జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల పథకం వేగంగా సాగుతోంది. మంత్రి పొంగులేటి సమీక్షలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై కూడా చర్చ జరిగింది. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం ఉండకూడదని, అర్హత మాత్రమే ప్రమాణంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. భూముల గుర్తింపు, ఎంపిక ప్రక్రియ వేగంగా పూర్తయితే నిర్మాణాలు మరింత వేగవంతం అవుతాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.












Click it and Unblock the Notifications
