'మోడీకి భయపడుతున్న కేసీఆర్', 'రద్దుతో అదానీ-అంబానీలకే ప్రయోజనం'
రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ ఆదివారం ఆరోపించారు.
హైదరాబాద్: రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏమాత్రం పట్టించుకోవడం లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధివారం ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీకి కేసీఆర్ భయపడుతున్నారన్నారు.
నోట్ల రద్దుతో ప్రజల జీవితాలు అస్తవ్యస్తంగా మారాయని చెప్పారు. నిరసనల ద్వారా సామాన్య ప్రజల ఇబ్బందులను తెలిపామన్నారు. నోట్ల రద్దు చేసి ఇరవై రోజులు అవుతున్నా ఏటీఎంలలో సరిపడా నగదు లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

అదానీ, అంబానీలకే ప్రయోజనం
విదేశాల్లో ఉన్న నల్లధనం వెలికి తీయాలని ఇందుకు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సరికాదని సిపిఐ నేత సురవరం అన్నారు. అదానీ, అంబానీల ప్రయోజనాల కోసమే నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. నోట్ల రద్దుతో సామాన్యులే ఇబ్బందులు పడుతున్నారన్నారు.
విజయ్ మాల్యా వంటి నల్ల కుబేరులు దర్జాగా బతుకుతున్నారన్నారు. రూ.2వేల నోటు ఎందుకు తీసుకు వచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. నల్ల కుబేరులకు ప్రధాని మోడీ సేవకుడిగా మారారని ఎద్దేవా చేశారు.
విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తేలేక చేతులెత్తేసిన మోడీ నోట్ల రద్దుతో సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. మోడీ నియంతృత్వం పద్ధతిలో పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. పార్లమెంటుపై ప్రధానికి గౌరవం లేదని, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ఆయన పార్లమెంటులో మాట్లాడరని, బయట బహిరంగ సభల్లో మాట్లాడుతారన్నారు.












Click it and Unblock the Notifications