Karnataka: రూ.300 కోసం కర్ణాటక రైతులుగా నటించారట..!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జోరుగా ప్రచారం చేస్తోంది. ఆరు గ్యారెంటీలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కర్ణాటకలో కూడా ఇవే గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అక్కడ ఇచ్చిన హామీలను అమలు చేస్తోంది. అయితే కొద్ది రోజుల క్రితం వికారాబాద్ జిల్లా పరిగిలో కర్ణాటక రైతుల పేరిట కొందరు వ్యక్తులు ప్లకార్డులతో హల్ చల్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓటు వెయ్యొద్దని.. కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని చెప్పుకొచ్చారు. వారు వికారాబాద్ జిల్లా కొడంగల్ చౌరస్తా నుుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు.
అయితే వీరికి స్థానికంగా ఉంటే కొందరు బీఆర్ఎస్ నేతలు కూడా మద్దతు తెలిపారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు వారి అడ్డుకున్నారు. ఎన్నికల సమయంలో వేరే ప్రాంతాల వారిని ఇక్కడికి ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. గొడవ పెద్దది కావడంతో అక్కడి చేరుకున్న పోలీసులు ఎక్కడి వారిని అక్కడ పంపించేశారు. రైతులు వచ్చిన వారు తమ వెంట తెచ్చుకున్న ప్లకార్డులను మార్కెట్ యార్డులోనే వదిలేసి బయటకు వెళ్లిపోయారు.

దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో కొందరు తమ వాహనంలో వెళ్లిపోగా.. ఐదుగురు మాత్రం పరిగిలోనే ఉండిపోయారు. వారిని కాంగ్రెస్ నాయకులు గుర్తించి.. ప్రశ్నించగా అసలు విషయం బయటకొచ్చింది. వీరంతా రైతులు కాదని కేవలం300 రూపాయల కూలీ కోసం ఓ ఏజెంట్ ద్వారా రైతుల వేషంలో పరిగికి వచ్చారని తేలిపోయింది. దీంతో కాంగ్రెస్ నేతలు వారితో వీడియోలో మాట్లాడించారు. సదరు ఏజెంట్ఎలా చెబితే తాము అలా చేశామని వారు చెప్పారు.
చివరకు తమను పరిగిలోనే వదిలి వెళ్లిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటకలోని కోట్రిక నుండి తాము వచ్చామని, 300 రూపాయలు ఇస్తామంటే వాహనంలో ఎక్కుంచుకుని వచ్చారని చెప్పారు. తమతో పని చేయించుకున్నాక.. వదిలి వెళ్లిపోయారని కర్ణాటక వ్యక్తులు తెలిపారు. అయితే వీరిని ఎవరు తీసుకొచ్చారు అనేది తెలియాల్సి ఉంది. బీఆర్ఎస్ నాయకులే వారిని తీసుకొచ్చినట్లు హస్తం నేతలు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications