కేసీఆర్ వర్సస్ అమిత్ షా - హైదరాబాద్ కేంద్రంగా : సెప్టెంబర్ 17 - పొలిటికల్ హీట్..!!
సెప్టెంబర్ 17. ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలను హీటెక్కిస్తున్న రోజు. గత ఏడాది వరకు ఈ తేదీని తెలంగాణ విమోచన..కాదు విలీన దినోత్సవం అంటూ రాజకీయ రగడ కొనసాగేది. ఈ ఏడాది పెరుగుతున్న పొలిటికల్ హీట్ లో పార్టీల స్టాండ్ మారింది. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ రేపు (సెప్టెంబర్ 17) తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల పేరుతో నిర్వహించేందుకు రంగం సిద్దం చేసింది. ఇదే సమయంలో బీజేపీ రంగంలోకి దిగింది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహణకు నిర్ణయించింది.

ఇటు కేసీఆర్..అటు అమిత్ షా
ఇందులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా పాల్గొంటున్నారు. కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు.. నాడు కలిసి ఉన్న కర్ణాటక - మహారాష్ట్ర ప్రాంతాల్లోనూ ఈ వేడుకలు నిర్వహణకు మార్గదర్శకం చేసింది. హైదరాబాద్ కేంద్రంగా జరిగే కార్యక్రమం కోసం బీజేపీ- కేంద్ర ప్రభుత్వ విభాగాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాయి. సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్స్ లో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ రాత్రికి అమిత్ షా హైదరాబాద్ చేరుకుంటారు. రేపు పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే విమోచన వేడుకల్లో పాల్గొంటారు. కీలక సందేశం ఇవ్వనున్నారు. కేంద్ర విభాగాల పెరేడ్ కు నిర్ణయించారు. అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 16, 17, 18 తేదీలల్లో మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఈ వేడుకలు జరగనున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం మూడు రోజుల వేడుకలు
సెప్టెంబర్ 16 వ తేదీన... రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువతీ యువకులు, మహిళలతో భారీ ర్యాలీలు నిర్వహించాలని డిసైడ్ చేసారు. రేపు పీఎం కేసీఆర్ హైదరాబాద్ లోని జాతీయ జండా ఆవిష్కరణ చేసి ప్రసంగించనున్నారు. అదే రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు , మున్సిపాలిటి, పంచాయతీ కేంద్రాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. శనివారం మధ్నాహ్నం హైదరాబాద్‌లోని బంజారా భవన్, ఆదివాసీ భవన్‌లను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. మూడో రోజు కార్యక్రమంలో భాగంగా.. అన్ని జిల్లా కేంద్రాల్లో స్వాతంత్ర్య సమరయోధులకు సన్మానాలు చేయనున్నారు.

తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపుగా
ఇటు కాంగ్రెస్ తెలంగాణ స్వతంత్ర దినోత్సవం పేరుతో కార్యక్రమాల నిర్వహణకు సిద్దమైంది. అటు ఎంఐఎం కూడా శనివారం పాతబస్తీలో జాతీయ జెండాలు చేతపట్టి భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో.. ఇప్పుడు అన్ని పార్టీలు సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణలో తమ పట్టు నిరూపించుకొనేందుకు.. రాజకీయంగా ప్రత్యర్ధి పార్టీల పైన పై చేయి సాధించేందుకు కార్యచరణ సిద్దం చేసుకున్నాయి. రేపటి రోజున జరిగే ఈ సభలు-ప్రసంగాలపైన రాజకీయంగా ఉత్కంఠ నెలకొని ఉంది. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా తెలంగాణలో పరిస్థితులు మారుతునున్న సమయంలో ఇప్పుడు పోటా పోటీగా సెప్టెంబర్ 17 నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల పైన జాతీయ స్థాయిలో ఆసక్తి కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications