Dharmapuri: ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తలుపులు పగలగొట్టిన అధికారులు.. హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ..
ఎట్టకేలకు జగిత్యాల జిల్లా ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తలుపులను అధికారులు తెరిచారు. హైకోర్టు ఆదేశాలతో స్ట్రాంగ్ రూమ్ తాళాలు అధికారులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. 2018 ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మన్ హైకోర్టుకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి, ప్రస్తుత మంత్రి కొప్పుల ఈశ్వర్ 441 ఓట్ల తేడాతో గెలిచారు. అయితే మళ్లీ రీకౌంటింగ్ నిర్వహించాలని లక్ష్మణ్ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. లక్ష్మణ్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇందుకు సంబంధించి నివేదిక సమర్పించాలని జగిత్యాల జిల్లా అధికారులను ఆదేశించింది.
హైకోర్టు కోర్టు ఆదేశాలతో ఈ నెల ఏప్రిల్ 10వ తేదీనే స్ట్రాంగ్ రూమ్ తాళాలు తెరవడానికి అధికారులు సిద్ధమయ్యారు. కానీ స్ట్రాంగ్ రూమ్ తాళపు చెవి పోయిందని అధికారులు తెలిపారు. తాళపు చెవిలు పోవడంపై విచారణ చేపట్టాలని భారత ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. కేంద్ర ఎన్నికల అధికారి ఏప్రిల్ 17వ తేదీన నాచుపల్లి జేఎన్టీయూలో నాటి ఎన్నికల అధికారి శరత్, ఆ తర్వాత విధులు నిర్వహించిన కలెక్టర్ రవినాయక్, ప్రస్తుత కలెక్టర్ యాస్మిన్ బాషాతో పాటు, నాటి రిటర్నింగ్ ఆఫీసర్, ఇతర అధికారులను విచారించారు.


ఈ క్రమంలో నాటి అభ్యర్థుల సమక్షంలో ఆదివారం స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టారు. నాటి ఎన్నికలకు సంబంధించిన కీలకమైన ప్రొసీడింగ్స్, 17ఏ, 17 సీ ఫామ్స్‌తో పాటు, ఫలితాల రోజు కౌంటింగ్ రూమ్ సీసీ కెమెరాల ఫుటేజ్‌ను జిల్లా అధికారులు హైకోర్టుకు సమర్పించనున్నారు. ఏప్రిల్ 26లోపు నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే..












Click it and Unblock the Notifications