ఫామ్‌హౌస్‌లో పార్టీ ఎఫెక్ట్: పరారీలో రాజ్ పాకాల
జన్వాడ ఫాంహౌస్ పార్టీ కేసులో పోలీసులు విచారణ జరుపుతుండగా.. నిందితుడు రాజ్ పాకాల పరారీలో ఉన్నాడు. పార్టీ కేసులో విచారణ చేస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ శ్రీలత తెలిపారు. ఏ1గా ఫాంహౌస్ సూపర్ వైజర్ కార్తిక్, ఏ2గా రాజ్ పాకాలను చేర్చామని ఆమె చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించి పార్టీ నిర్వహించారని తెలిపారు.
కర్ణాటక లిక్కర్ తోపాటు విదేశీ మద్యం కూడా స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. ఏడు లీటర్ల విదేశీ మద్యాన్ని సీజ్ చేశామని వివరించారు. ఫామ్ హౌస్ యజమాని, మాజీ మంత్రి కేటీఆర్ బంధువు రాజ్ పాకాల ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సీఐ శ్రీలత తెలిపారు. ఈ కేసు విచారణలో మరికొన్ని విషయాలు వెలుగులోకి రావాల్సి ఉందన్నారు.

ఇది ఇలావుండగా, దీపావళి సందర్భంగా రాజ్ పాకాల బంధువులకు పార్టీ ఇచ్చారని అంతే తప్ప.. రేవ్ పార్టీ నిర్వహించారనడం సరికాదని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అన్నారు. బంధువులతో కలిసి వేడుక నిర్వహించుకుంటే రేవ్ పార్టీ అంటూ వార్తలు రాయడం సమంజసం కాదన్నారు. రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.
మాజీ మంత్రి ఇంటికి ఎక్సైజ్, పోలీసులు నేరుగా వచ్చారని.. సీఎం రేవంత్ ఆదేశాలతోనే కేటీఆర్‌పై కుట్రకు యత్నం జరిగిందని బాల్క సుమన్ వ్యాఖ్యానించారు. పార్టీ జరిగింది ఫాంహౌస్ లో కాదు.. ఇంట్లో అని తెలిపారు. రాజ్ పాకాల ఇటీవల గృహప్రవేశం చేశారని తెలిపారు. ఈ సందర్భంగానే బంధువులకు పార్టీ ఇచ్చారని చెప్పారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నమేనని అన్నారు.
మరోవైపు, ఓరియన్ విల్లాస్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సోదాలు చేసేందుకు వచ్చిన పోలీసులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సీఎం రేవంత్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజా సంక్షేమం మరిచి ప్రభుత్వం వ్యక్తిగత కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అరెస్ట్ చేసి అక్కడ్నుంచి తరలించారు. ఈ క్రమంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చివరకు పోలీసులు ఓరియన్ విల్లాలో సోదాలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications