జయకు వారసులు లేరా?: పిటిషనర్‌పై హైకోర్టు ఫైర్, రూ.లక్ష జరిమానా
హైదరాబాద్: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల వ్యవహారంలో హైకోర్టు తీవ్రంగా స్పందించింది. వారసులు లేనందున జయలలిత ఆస్తులను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలంటూ గరీబ్‌గైడ్ అనే సంస్థ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
అంతేగాక, పిటిషనర్‌కు రూ. లక్ష జరిమానా విధించింది హైకోర్టు. నాలుగు వారాల్లోగా జరిమానా చెల్లించాలని తీర్పు చెబుతూ పిటిషన్ కొట్టివేసింది. జరిమానా చెల్లించకుంటే తెలంగాణ ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

జయలలిత మరణించి 15 రోజులు కూడా గడవకముందే ఇలాంటి పిటిషన్లు వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, జయకు పెళ్లి కాలేదని, ఆమె ఎవరూ లేరని, ఆమె సోదరుడు కూడా మరణించారని.. అందువల్ల ఆమెకు చెందిన హైదరాబాద్‌లోని తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పిటిషన్ దారులు తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
అయితే, జయకు సోదరుడు ఉన్నందున ఆమెకు వారసులు లేరని ఎలా అంటారని హైకోర్టు ప్రశ్నించింది. జయ సోదరుడికి ఒక కొడుకు, ఒక కూతురు ఉందని పేర్కొన్న హైకోర్టు.. హిందూ చట్టం ప్రకారం ఆమె ఆస్తులు వారికే చెందుతాయని స్పష్టం చేసింది.
ఇలాంటి పిటిషన్లు వేయడం వల్ల కోర్టు సమయం వృథా అయిందని, గందరగోళానికి గురిచేసేలా పిటిషన్ ఉందని హైకోర్టు మండిపడింది. కాగా, జయలలితకు హైదరాబాద్‌లోని జీడిమెట్లలో ఫాంహౌస్, శ్రీనగర్ కాలనీలో బహుళ అంతస్థుల భవనం ఉన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications