పోలింగ్ వేళ.. జూబ్లీహిల్స్ పై ఈసీ తాజా ప్రకటన
Jubilee Hills bypoll: ఇంకొక్క రోజు మాత్రమే మిగిలివుంది. మంగళవారం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన ఎన్నిక ఇది. మూడు పార్టీలకూ అగ్నిపరీక్ష పెడుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ.. ఈ నియోజకవర్గంపై కన్నేశాయి. దీన్ని హస్తగతం చేసుకోవడానికి పోటీ పడుతున్నాయి. ఆదివారం సాయంత్రానికి ప్రచార పర్వం పరిసమాప్తమైంది.
బీఆర్ఎస్ శాసన సభ్యుడు మాగంటి గోపీనాథ్ కన్నుమూత వల్ల ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అవసరమైన విషయం తెలిసిందే. ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరుగనుంది. 14వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే నామినేషన్ల పర్వం మొత్తం ముగిసింది. ఆయా పార్టీలన్నీ ప్రచారబరిలో దిగాయి. సిట్టింగ్ బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు.

పోలింగ్ సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ తీసుకున్న ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల కమిషన్ తాజా ప్రకటన విడుదల చేసింది. మొత్తం ఓటర్ల జాబితా, పోలింగ్ బూత్ లు, ఓట్ల లెక్కింపు కేంద్రాలు.. వంటి వివరలను ఇందులో పొందుపరిచింది. మొత్తం నాలుగు లక్షలమందికి పైగా ఓటర్ల తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జనరల్ - 2,08,561 పురుషులు, 1,92,779 మహిళా ఓటర్లు ఉన్నారు. మిగిలిన వారిలో సర్వీస్ ఎలక్టోర్స్- 18, ఎన్నారై- 123, ప్రజా పనులు-1908, 18-19 మధ్య వయస్సు-6,859, 85 సంవత్సరాలకు పైనున్న ఓటర్లు-2,134 ఉన్నారు.
మొత్తం 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటయ్యాయి. సగటున 986 మంది ఓటర్లకు ఒక్కో పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. 99వ నంబర్ గల పోలింగ్ కేంద్రం పరిధిలో అత్యధికంగా 1,233 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రం నంబర్ 540. 1,200 మంది కంటే ఎక్కవ ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు 11 ఉన్నాయి. 45 చొప్పున ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ ఏర్పాటయ్యాయి. మొత్తం 2,060 మంది పోలింగ్ సిబ్బంది ఇందులో పాల్గొననున్నారు. ఈ నెల 14వ తేదీన యూసుఫ్ గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్లను లెక్కిస్తారు.












Click it and Unblock the Notifications