దారులు తెరిచే ఉన్నాయి.. టీఆర్ఎస్ లో మళ్ళీ జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యల దుమారం
టిఆర్ఎస్ పార్టీలో మరోమారు జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యల దుమారం రేగింది. గత కొంత కాలంగా టిఆర్ఎస్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీ మారతారని చాలాసార్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే నేటికి టిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్న ఆయన తాజాగా కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణులలో ఆసక్తికర చర్చకు కారణమవుతున్నాయి.

టీఆర్ఎస్ లో జూపల్లి కృష్ణారావు అసంతృప్తి రాగం
టిఆర్ఎస్ పార్టీలో గతంలో ఒక వెలుగు వెలిగిన జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంత్రిగా విధులు నిర్వర్తించారు. 2014- 2018 మధ్యలో టీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించిన ఆయన 2018 లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక ఆయన పై గెలిచిన బీరం హర్షవర్ధన్ టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోగా, జూపల్లి కృష్ణారావు కొంతకాలంగా టిఆర్ఎస్ పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన ఎప్పుడైనా పార్టీ మారే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.

తన దారులు మూసుకుపోలేదు అంటూ జూపల్లి సంచలనం
జూపల్లి కృష్ణారావు రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ జరుగుతున్న సమయంలో తాజాగా ఆయన నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది. ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసిన ఆయన పార్టీ మార్పు ప్రచారంపై కార్యకర్తలతో మాట్లాడారు. ఇంకా తనకు దారులు మూసుకు పోలేదని, అన్ని దారులు తెరిచే ఉన్నాయి అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. మనకు ఉండేది మనకుంది, అందరూ మనల్నే అడుగుతున్నారు అంటూ కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఏదైనా నిర్ణయం తీసుకున్న తర్వాత వెనకడుగు వేయలేమని, అందుకే ఆలోచించి నిర్ణయం తీసుకుందామని ఆయన పేర్కొన్నారు.

జూపల్లి వ్యాఖ్యలతో మహబూబ్ నగర్ లో ఆసక్తికర చర్చ
కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూసుకుంటానని, మీ అందరి నిర్ణయమే నా నిర్ణయం అంటూ జూపల్లి కృష్ణారావు తెలిపారు. మీరు ఏ దారి ఎంచుకోవాలి అంటే అదే దారి ఎంచుకుంటా అంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజక వర్గం నుండి టికెట్ ఆశిస్తున్న జూపల్లి కృష్ణారావు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న బీరం హర్షవర్ధన్ రెడ్డి కే మళ్లీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని జరుగుతున్న చర్చ నేపథ్యంలో తాజాగా కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. జూపల్లి కృష్ణారావు ఏ దారి పడతారు ? ఏ పార్టీ తీర్థం పుచ్చుకుంటారు? అన్నది మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications