జస్టిస్ ఫర్ దిశ.... హస్తినలో ఇంకా హోరెత్తుతున్న ఆందోళనలు,ధర్నాలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ సామూహిక అత్యాచారం,హత్య ఘటన పై ఇప్పుడు దేశం మొత్తం ఆలోచనలో పడింది. దిశా అత్యాచారం, హత్య జరిగి దాదాపు ఆరు రోజులు కావస్తున్నా దేశంలో మాత్రం ప్రకంపనలు ఆగటం లేదు . ఇలాంటి అఘాయిత్యాలకు చెక్ పెట్టాలంటే ఎలా అని అందరూ ఆలోచిస్తున్న వేళ నేరస్తులకు వెంటనే శిక్షలు పడటం లేదని, అందుకే నేరస్తులకు భయం లేకుండా పోతుందని వెంటనే కఠిన శిక్షలు అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తూ ఇంకా ఆందోళనలు కొనసాగిస్తున్నారు మహిళలు .

ఢిల్లీలో ఇంకా కొనసాగుతున్న ఆందోళనలు
ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద మహిళా సంఘాలు నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. జస్టిస్ ఫర్ దిశ అని నినదిస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న వేళ కేంద్ర సర్కార్ పై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మహిళలు . పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న మహిళలు చట్టాల్లో సమూల మార్పులు రావాలని కోరుతున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ ఆందోళనలు, ధర్నాలు, ర్యాలీలతో హోరెత్తుతుంది. అత్యాచార ఘటనలకు నిరసనగా రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్‌లో రోజూ మహిళా సంఘాల ఆధ్వర్యంలో భారీ ఆందోళనలు కొనసాగుతున్నాయి.

వెంటనే దోషులకు శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ మహిళా సంఘాల ఆందోళన
జంతర్ మంతర్ సర్కిల్ వద్ద మహిళ సంఘాలు ఆందోళనల పర్వం కొనసాగుతుంది . మహిళా కార్యకర్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, నిందితుల్ని వెంటనే శిక్షించాలని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ప్లకార్డులు చేతబట్టుకుని నినాదాలు చేస్తూ ధర్నాలు చేస్తున్నారు . మహిళల నినాదాలతో జంతర్ మంతర్, పార్లమెంట్ స్ట్రీట్ ప్రాంతాలు హోరెత్తాయి. పార్లమెంట్ లో సైతం దీనిపై వాడి వేడి చర్చ జరిగిన వేళ మహిళా సంఘాల ఒత్తిడితో అయినా చట్టాల్లో మార్పు వస్తుందనే భావన ప్రస్తుతం వ్యక్తం అవుతుంది.

హైదరాబాద్ లోనూ కొనసాగుతున్న ఆందోళన. స్పందిస్తున్న ప్రముఖులు
ఇటు హైదరాబాద్ లో సైతం మహిళా సంఘాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వాలు సత్వర న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాయి. ఒకరుకాదు ఇద్దరు కాదు ప్రముఖులు, సినీ తారలు ముక్త కంఠంతో న్యాయం కావాలని కోరుతున్నారు. అల్లు అర్జున్, సినీనటి రాశి , సానియా మిర్జా ఇలా ప్రతి ఒక్కరు దిశ ఘటనపై తమ స్పందన తెలియ జేస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా, ప్రతిఒక్కరూ స్పందిస్తున్న తీరు రోజురోజుకీ పెరుగుతున్న అత్యాచారాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సీరియస్ నిర్ణయం తీసుకేనేలా ఒత్తిడి తెస్తున్నాయి.












Click it and Unblock the Notifications