సీఎం రేవంత్‌రెడ్డి సంచలన నిర్ణయం.. ఆ సినిమాపై నిషేధం?
భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా ఎమర్జెన్సీ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇందిరాగాంధీ పాత్రను బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పోషించారు. ఈ సినిమాకు దర్శకత్వం కూడా ఆమే వహించారు. తొలినుంచి ఈ చిత్రంపై విమర్శలు వస్తున్నాయి. తమను తప్పుగా చిత్రీకరించారంటూ శిరోమణి గురుద్వారా ప్రబంధన్ కమిటీ ప్రకటించింది. ఈ విషయంలో కంగనాకు లీగల్ నోటీసులు కూడా అందించారు.
సోషల్ మీడియాల్లో ఈ సినిమా ట్రైలర్ ను తొలగించాలని, మేకర్స్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. న్యాయనిపుణుల అభిప్రాయం తీసుకొని ఈ సినిమాను నిషేధించేందుకు ప్రయత్నిస్తానని గురుద్వారా కమిటీకి సీఎం హామీ ఇచ్చారు. సిక్కులను దేశద్రోహులుగా చిత్రీకరించారని, ఉగ్రవాదులుగా చూపించారని 18 మంది సభ్యుల బృందం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వద్ద ఆందోళన వ్యక్తం చేయగా ఆయన ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు.

దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన సందర్భంలో ఎదురైన అసమానతల్ని ఈ సినిమాలో చూపిస్తున్నారు. చరిత్రకు సంబంధించిన వాస్తవాలను వక్రీకరిస్తున్నారని, ప్రేక్షకుల్లో సిక్కులపై ద్వేషాన్ని పెంపొందించేవిధంగా ఈ చిత్రం ఉందని శిరోమణి అకాలీదళ్ ఫిలిం బోర్డుకు లేఖ రాశారు.

ఈ సినిమాలో మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టే సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని, ప్రజల్లో ద్వేషాన్ని పెంపొందించే ఈ తరహా చిత్రాలకు ప్రచారం కల్పించకూడదని, వాటిని విడుదల చేయడం ఆపాలని ఆయన కోరుతున్నారు. ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాలను తప్పుగా చూపించే అవకాశం ఉందన్న వార్తలతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సినిమాను రాష్ట్రంలో నిషేధించే దిశగా అడుగులు వేస్తోంది. కంగనారనౌత్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించింది. షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఈ చిత్రం వివాదాల మయంగా మారింది.












Click it and Unblock the Notifications