DK Shiva Kumar: కర్ణాటకకు రండి.. అక్కడే చూపిస్తాము.. కేసీఆర్, కేటీఆర్‍కు శివకుమార్ సవాల్..
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శివకుమార్ అన్నారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ నియోజవర్గం పరిగి లో ఈరోజు రెండో విడత బస్సు యాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. పదేళ్లయినా కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదన్నారు. తాము కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చామని స్పష్టం చేశారు.
కానీ పదేళ్లయినా కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. కర్ణాటకలో 5 గ్యారంటీలను అమలు చేశామని.. గృహజ్యోతి ద్వారా ప్రతీ ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వివరించారు. కర్ణాటకలో ప్రతీ మహిళకు నెలకు రూ. 2000 అందిస్తున్నామని వివరించారు. మేం చెప్పేది నిజమో కాదు కర్ణాటకలో ప్రతీ ఇంటికి వెళ్లి అడగండని కోరారు. కర్ణాటకలో మాదిరిగానే తెలంగాణలోనూ ప్రతీ మహిళకు కాంగ్రెస్ ఉచిత బస్సు ప్రయాణం అందిస్తామని తెలిపారు.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని శివ కుమార్ స్పష్టం చేశారు. బీజేపీకి బీ టీమ్ లా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందన్నారు. కర్ణాటకకు రండి.. తాము ఐదు గ్యారంటీలను అమలు చేస్తున్నామో లేదో చూపిస్తామని కేసీఆర్, కేటీఆర్ కు సవాల్ విసిరారు. తేదీ, సమయం మీరు చెప్పండి.. మిమ్మల్ని బస్సులో తీసుకెళ్లి నిరూపించడానికి తాం సిద్ధంగా ఉన్నట్లు శివకుమార్ స్పష్టం చేశారు.
డిసెంబర్ 9న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని శివకుమార్ జోస్యం చెప్పారు. ఎన్నికల తరువాత కేసీఆర్ ఇక ఫామ్ హౌస్ వెళ్లి రెస్ట్ తీసుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. కాగా కాంగ్రెస్ శుక్రవారం రెండో జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. 45 మందితో కాంగ్రెస్ రెండో లిస్ట్ ను విడుదల చేసింది.












Click it and Unblock the Notifications