క్షమించండి.. పోరాడలేకపోయాను, ఇక నుంచి - కవిత ఎమోషనల్..!!
జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భావోద్వేగానికి లోనయ్యారు. అమరవీరుల కుటుంబాలకు క్షమాపణ చెప్పారు. ఉద్యమకారులకు న్యాయం చేయలేకపోయామని చెప్పుకొచ్చారు. మంత్రిగా లేకపోయినా.. ఎంపీగా వారి కోసం న్యాయం చేయాలని కోరినట్లు వెల్లడించారు. ఇక నుంచి తన పోరాట పంథా మారుతుందని స్పష్టం చేసారు. జాగృతి జనం బాట యాత్రలో అందరినీ కలుస్తానని కవిత వెల్లడించారు.
జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేసారు. ఉద్యమకారుల కోసం కొట్లాడలేకపోయి నందుకు క్షమాపణలు చెప్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అమరుల అయ్యారని గుర్తు చేసుకున్నారు. తెచ్చుకున్న తెలంగాణలో అమరుల ఆశయాలు నెరవేర్చడంలో ఎంత వరకు ముందుకు వెళ్ళామో ఆలోచించుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం కోసం 1200 అమరులు అయ్యారని అనేక సందర్భాల్లో చెప్పామని.. అమరవీరుల కుటుంబాలకు అనుకున్న మేర న్యాయం చేయలేకపోయామని కవిత ఎమోషనల్ అయ్యారు. 500 మంది అమర వీరుల కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ఉద్యమకారులకు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ సీట్లు,కొన్ని చోట్ల ఎంపీపీ,జెడ్పిటిసి టిక్కెట్లు వచ్చాయని వివరించారు.

కానీ, ఉద్యమకారులకు అనుకున్న మేర న్యాయం జరగలేదని కవిత వ్యాఖ్యానించారు. తాను మంత్రిగా లేకపోయినా ఎంపీగా అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాలని అడిగానని.. ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు కోట్లాడలేకపోయినందుకు తాను బహిరంగ క్షమాపణ చెప్తున్నట్లు పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వాలని కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే వచ్చే ప్రభుత్వంతో ఇప్పిస్తామని కవిత హామీ ఇచ్చారు. తాను 33 జిల్లాలు,119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటనకు బయలుదేరు తున్నట్లు వెల్లడించారు. అందరి కోసం సామాజిక తెలంగాణ రావాలి..అందరి కోసం తెలంగాణ సాధించుకున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు రావాలి అని ఆకాంక్షించారు. అగ్రవర్ణాల్లో అన్ని కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం లేదని చెప్పకొచ్చారు.
అన్ని వర్గాలు కలిసి ఉంటే తెలంగాణ బాగుంటుందన్నారు. ఆత్మ గౌరవంతో కూడిన తెలంగాణ ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని కవిత పేర్కొన్నారు. జిల్లాల్లో జరగాల్సిన అభివృద్ధి ఎక్కడ ఆగిపోయిందో అక్కడకు వెళ్లి పోరాటం చేస్తామని చెప్పారు. గతంలో జాగృతిలో పనిచేసిన వారికి స్వాగతం పలుకుతున్నా మనస్పర్థలు ఉంటే పక్కన పెట్టమని కోరారు. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ తీసివేశారన్నారు. తిరిగి తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఉండే దాకా పోరాటం చేద్దామని.. సామాజిక తెలంగాణ కోసం కలిసిరావాలని కవిత పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వంపై జంగ్ సైరన్ చేద్దాం అంటూ కవిత నినదించారు.












Click it and Unblock the Notifications