వీధి రౌడీలా రేవంత్ రెడ్డి.. వాళ్లకు క్షమాపణ చెప్పాలి!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా, యాజమాన్యాల తాట తీస్తామని వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. జనం బాట పేరుతో కవిత చేపట్టిన పాదయాత్ర నేడు, రేపు వరంగల్ హన్మకొండ జిల్లాలలో జరగనుంది . ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత హన్మకొండలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కవిత
తమాషా చేస్తే తాట తీస్తా, తొక్కుతా అంటూ ప్రైవేట్ కళాశాలలకు రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడం దారుణమన్నారు. కళాశాలల యాజమాన్యాల పట్ల సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని కవిత పేర్కొన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కోసం కొందరు విద్యార్థులు తన దగ్గరకు వచ్చి కలిసారని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించి, వారి చదువు ఆగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందన్నారు.

వారికి రేవంత్ క్షమాపణ చెప్పాలి
ఆంధ్ర పాలనలో తెలంగాణ రాష్ట్రంలో కళాశాలలు లేని రోజు ఇక్కడి వారు కళాశాలలను పెట్టి తెలంగాణ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు అని, అటువంటి వారిపట్ల రేవంత్ రెడ్డి వైఖరి ఆక్షేపణీయం అని కవిత అన్నారు. తక్షణం రేవంత్ రెడ్డి వారికి క్షమాపణ చెప్పాలన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పేద విద్యార్థులకు ఇస్తున్నారని, ఈ విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కళాశాలల యాజమాన్యాల పైన తీవ్ర వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు.
ప్రజల సమస్యల పరిష్కారానికి కవిత పాదయాత్ర
యాజమాన్యాలకు మద్దతుగా తెలంగాణ జాగృతి తరఫున పోరాటం చేస్తామన్నారు.ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నాయని, ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనం బాట కార్యక్రమం ద్వారా ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రజాక్షేత్రంలోకి వెళుతున్న విషయం తెలిసిందే.
వరద ముంపు ప్రాంతాలలో పర్యటిస్తున్న కవిత
ఈరోజు జనం బాటలో భాగంగా హన్మకొండ, వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న కవిత స్థానికంగా ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఆ సమస్యల పరిష్కారం కోసం తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. ఇటీవల వరంగల్లో వచ్చిన వరదలకు ముంపుకు గురై తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలలో బాధిత కుటుంబాలను కవిత పరామర్శించారు. వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications