కవిత చాప్టర్ క్లోజ్.. తేల్చేసిన కేటీఆర్
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)లో కల్వకుంట్ల కవిత సస్పెన్షన్ వ్యవహారం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. ఒక సాధారణ నాయకుడి విషయంలో అయితే ఇంత చర్చ ఉండేది కాదు, కానీ కవిత బీఆర్‌ఎస్ వ్యవస్థాపకుడు కేసీఆర్ కుమార్తె, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సోదరి కాబట్టి ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. కుటుంబం పెత్తనం సాగుతున్న పార్టీలోనే ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఒకరకంగా షాక్ కలిగించే విషయం.
పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కవితపై విమర్శల దాడి మొదలైంది. పార్టీలోని పలు వర్గాలు ఆమెకు వ్యతిరేకంగా స్వరం వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఆమెపై ఊహించని స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. గతంలో ఆమె గురించి పాజిటివ్‌గా మాట్లాడిన వారంతా ఇప్పుడు మౌనంగా ఉన్నారు. కొందరైతే తాము కవితతో కలిసి పనిచేయలేమని, తమ అధినేత కేసీఆర్ మాత్రమే అని స్పష్టం చేశారు. ఈ పరిణామాలన్నీ కవితను రాజకీయంగా ఒంటరిని చేయాలనే ప్రణాళిక అత్యంత విజయవంతంగా కొనసాగుతోంది.

కవిత సస్పెన్షన్ నిర్ణయంపై బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మొదటిసారిగా స్పందించారు. ఇది ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం కాదని, పార్టీలో చర్చించిన తర్వాతే ఈ చర్య తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక మాట్లాడటానికి ఏమీ లేదని కూడా కేటీఆర్ పేర్కొన్నారు. మరోవైపు, కవిత ప్రాథమిక పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
కవిత తన సొంత రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఆమె త్వరలో కొత్త పార్టీని స్థాపించనున్నారని, దాని అజెండా బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడటమేనని కవిత వర్గీయులు చెబుతున్నారు. సెప్టెంబర్ 17 లోపు పార్టీ విధివిధానాలు ఖరారవుతాయని, త్వరలో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని అంటున్నారు. బీఆర్‌ఎస్‌లో నెలకొన్న ఈ సంక్షోభం రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications