గులాబీ బాస్ పెద్దపల్లి టికెట్ విషయంలో వివేక్ కు షాక్ ఇవ్వటానికి రీజన్ ఇదే
త్వరలో జరగనున్న ఎన్నికల్లో 16 స్థానాలు కైవశం చేసుకోవాలని పట్టుదలతో ఉన్న సీఎం కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల టికెట్ల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకున్నారు. గెలుపు గుర్రాలు అని భావించిన వారికే టికెట్లు ఇచ్చి అభ్యర్థులుగా బరిలో నిలిపారు . సామాజిక సమీకరణాలు, పార్టీ అంతర్గత సర్వే, క్రమశిక్షణ, విధేయత తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేశారు. నలుగురు సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు కేటాయించని కేసీఆర్ జిల్లా పార్టీ శ్రేణులకు, ఎమ్మెల్యేలకు, ప్రస్తుత మంత్రుల మాటకు పెద్దపీట వేసి వారందరి అభిప్రాయం మేరకే టికెట్ల కేటాయింపు జరిపారు.

స్థానిక నేతల , ఎమ్మెల్యేల , మంత్రుల మాటకే పట్టం .. కేసీఆర్ ఎంపీ అభ్యర్థుల నిర్ణయం
ఇక స్థానిక నేతలు ముక్తకంఠంతో వ్యతిరేకించడంతోనే జితేందర్ రెడ్డికి టికెట్ కేటాయించలేదని తెలుస్తోంది. ఇక సీతారాం నాయక్ ఎంపీగా చురుగ్గా పనిచేయలేదన్న కారణంతో ఆయన్ను తప్పించినట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరులో తుమ్మల నాగేశ్వరరావుకు వ్యతిరేకంగా పనిచేశారన్న ఆరోపణల కారణంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి టికెట్ దక్కలేదు. ఇక వివేక్‌కు టికెట్ ఇవ్వొద్దని పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని ఎమ్మెల్యేలు ఫిర్యాదుచేయడంతో ఆయనకు టికెట్ ఇవ్వలేదని తెలుస్తోంది.
పెద్దపల్లి నియోజకవర్గంలో మాజీ ఎంపీ వివేక్ కు కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ, టిక్కెట్లు దక్కుతుందని అందరూ భావించారు. కానీ వివేక్ ను సైతం పక్కనపెట్టి గులాబీ బాస్ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

మాజీ ఎంపీ వివేక్ కు టికెట్ ఇవ్వకపోవటానికి అసెంబ్లీ ఎన్నికల పరిణామాలే కారణం
మాజీ ఎంపీ వివేక్ కు టికెట్ ఇవ్వకపోవడానికి ముందస్తు అసెంబ్లీ ఎన్నికలను , అప్పుడు జరిగిన పరిణామాలను కారణంగా భావించవచ్చు. ఎందుకంటే ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సమయంలో సోదరుడికి టికెట్ ఇవ్వనందుకు, వివేక్ తమ నియోజకవర్గాల్లో వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని, ప్రత్యర్ధులను గెలిపించేందుకు నిధులు ఇస్తున్నారని గులాబీ బాస్ కు నలుగురు అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. ఆయన సోదరుడు వినోద్ కాంగ్రెస్ పార్టీలో చేరుతానని, తిరిగి కాంగ్రెస్ లో చేరకుండానే ఎన్నికల్లో పోటీ చేయడం వంటి పరిణామాలు ఇప్పుడు వివేక్ కు టికెట్ దక్కకుండా చేశాయి.

సోదరుడి నిర్వాకం ...స్థానిక నేతల వ్యతిరేఖతే వివేక్ కొంప ముంచింది
పార్టీ సీనియర్ నేతల్లో ఒకరు అయిన వివేక్ పై శాసనసభ ఎన్నికల ముందు వరకు మంచి సానుకూలత ఉంది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల పుణ్యమాని కష్టకాలం మొదలైంది . ఇక వివేక్ అభ్యర్థిత్వంపై మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు తోడు మిగిలిన ఎమ్మెల్యేలు సైతం పూర్తిగా వ్యతిరేకించారు. వివేక్ విషయంలో చివరివరకు సానుకూలంగా నిర్ణయం తీసుకునేందుకు సీఎం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఎమ్మెల్యేలు ‘ససేమిరా' అన్నట్లు తెలిసింది. దీంతో సీఎం కేసీఆర్ సీనియర్ నాయకుడు, సన్నిహితుడు అయిన వివేక్ కు సైతం నో ఛాన్స్ అన్నారని తెలుస్తుంది.












Click it and Unblock the Notifications