సకల జనుల సమ్మె స్పెషల్ లీవ్: కెసిఆర్ వరం, 'కిరణ్ రెడ్డి జీవితం అంధకారం'
హైదరాబాద్: ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంచి బహుమతి ఇచ్చారు! ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగులు చేపట్టిన 'సకల జనుల సమ్మె' కాలాన్ని స్పెషల్ లీవ్‌గా ప్రకటించేందుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు.
దానికి సంబంధించిన దస్త్రం పైన ఆయన సంతకం చేశారు. త్వరలో జీవో విడుదల చేయనున్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 42 రోజుల పాటు ప్రభుత్వోద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎప్పటి నుంచో సాధారణ సెలవుగా మార్చాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

అంతేగాక ప్రభుత్వం కూడా ఎన్నికల సమయంలో ఉద్యోగులకు హామీ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో త్వరలో జీవో విడుదల కానుంది. ఇది సకల జనుల సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులకు శుభవార్త.
కిరణ్ రాజకీయ జీవితమే అంధకారమైంది: జూపల్లి
కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ వస్తే అంధకారమవుతుందన్నారని, కానీ ఆయన రాజకీయ జీవితమే అంధకారమైందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని పెబ్బేరులో పెబ్బేరు-కొల్లాపూర్ డబుల్ రోడ్డుకు జరిగిన భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకాన్ని యూపీ, బెంగాల్ ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. అరవై ఏళ్లలో జిల్లాలో కేవలం 10 టీఎంసీల సామర్థ్యం ఉన్న జూరాల ప్రాజెక్టును మాత్రమే నిర్మించారన్నారు.
సమైక్య పాలనలో రోడ్ల నిర్మాణంపై శ్రద్ధ పెట్ట లేదన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు, పాలమూరు ఎత్తిపోతల ద్వారా రాబోయే మూడన్నరేళ్లలో 14 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామన్నారు. త్వరలో సోమశిల, సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మాణాన్ని చేపడతామని చెప్పారు.












Click it and Unblock the Notifications