లోక్‌సభ ఎన్నికల తర్వాత గందరగోళమే: కాంగ్రెస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలంటూ కేసీఆర్ సంచలనం
రాబోయే రోజుల్లో ఉద్యమ కాలం నాటి కేసీఆర్‌ను మళ్లీ చూస్తారని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. గురువారం తెలంగాణ భవన్‌లో పార్టీ లోక్‌సభ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిందన్నారు.
కాంగ్రెస్ సర్కారుపై తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైందన్నారు కేసీఆర్. రానున్న రోజులు మనవేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో టీం వర్క్, స్థిరత్వం లేదన్నారు. ఉద్యమకాలం కేసీఆర్‌ను మళ్లీ చూస్తారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు కొందరు తనతో టచ్‌లో ఉన్నారని, అక్కడ అంతా బీజేపీ పెత్తనమే నడుస్తోందని వారు చెప్పారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని రావాలా సార్ అని ఓ సీనియర్ కీలక నేత తనను సంప్రదించాడు. ఇప్పుడే వద్దని వారించానని కేసీఆర్ తెలిపారు.

కాంగ్రెస్‌లోకి వెళ్లిన నేతలు బాధపడుతున్నారు. గతంలో 104 మంది ఎమ్మెల్యేలున్న మన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించింది. 64 మంది ఎమ్మెలున్న కాంగ్రెస్ ను వదలిపెడుతుందా? లోక్ సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం తలెత్తుతుంది. ఏం జరిగినా మనకే మేలు. రాష్ట్రంలో భవిష్యత్ బీఆర్ఎస్‌దే అని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
కొందరు నేతలు పార్టీని వీడి వెళ్లినంత మాత్రానా బీఆర్ఎస్‌కు నష్టం ఏమీ లేదు అని కేసీఆర్ స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో మన గళం వినిపించాల్సిన అవసరం ఉంది. రైతు సమస్యలు అజెండాగా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలి. రైతు సమస్యలపై పోస్టుకార్డు ఉద్యమం ఉధృతం చేయాలి. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో లక్ష పోస్టుకార్డులు రాయాలి. రైతుల కల్లాల కాడికి వెళ్లి రూ. 500 బోనస్‌పై ప్రభుత్వాన్ని నిలదీయాలి. ప్రభుత్వ హామీలను కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేయాలి. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. దాన్ని అనుకూలంగా మలుచుకోవాలి అని కేసీఆర్ సూచించారు.
బస్సు యాత్రం చేద్దాం.. జనం నుంచి మంచి స్పందన వస్తోందని కేసీఆర్ తెలిపారు. ఏప్రిల్ 22 నుంచి రోడ్ షోలు నిర్వహిస్తామన్నారు. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని రెండు, మూడు అసెంబ్లీ ఏరియాల్లో రోడ్‌షోలు ఉంటాయన్నారు. రోజుకు రెండు, మూడు రోడ్‌షోలు ఉంటాయన్నారు. ఉదయం సమయంలో రైతుల వద్దకు వెళ్లాలని నిర్ణయించారు. సాయంత్రం వేళ రోడ్డు షోలు, కార్నర్ మీటింగ్స్ నిర్వహించనున్నారు. వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ సెంటర్లలో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications