ఏపీకి ఆ హక్కుంది, గిల్లికజ్జాలొద్దు: బాబు ప్రతిపాదనను అంగీకరించానని కెసిఆర్
ఖమ్మం: తెలుగు రాష్ట్రాలు అనేక విషయాల్లో పరస్పరం సహకరించుకుంటూ.. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందకు సాగాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. భద్రాచలంలో ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. అన్ని విషయాల్లో ఆంధ్రప్రదేశ్‌కు సాధ్యమైనంత మేర సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
అనవసరంగా గిల్లికజ్జాలు పెట్టుకుంటే ఇద్దరికీ నష్టమేనన్నారు. ఆలంపూర్ నుంచి భద్రాచలం వరకు ఏపీ, తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలుగా ఉన్నాయని కేసీఆర్ తెలిపారు. ఖమ్మం జిల్లాలోని దుమ్ముగూడెం ప్రాజెక్టు కిందికి వెళ్లిన నీరు తెలంగాణ వాడుకోవడానికి వీళ్లేదని.. ఆ నీటిని ఆంధ్రా ప్రాంతమే వాడుకుంటుందన్నారు.
దుమ్ముగూడెం వద్ద ఆంధ్రప్రదేశ్‌కు సహకరిస్తామని తాను శాసనసభ సాక్షిగా హామీ ఇచ్చినట్లు కేసీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ వెయ్యి టీఎంసీలు వాడుకున్నా ఆంధ్రాకు మరో 1500 టీఎంసీలు ఉంటాయన్నారు. నీటి విషయంలో సమస్యలు రాకుండా పరస్పరం సహకరించుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చేసిన ప్రతిపాదనను తాను అంగీకరించినట్లు కేసీఆర్ చెప్పారు.

సముద్రంలోకి వృథాగా పోయే నీటిని తెలుగు బిడ్డలు ఎక్కడ వాడుకున్నా మంచిదేనని కేసీఆర్ అన్నారు. భద్రాచలం నియోజకవర్గంలోని ముంపు మండలాల సమస్యలపై ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడానని, ఆయన సానుకూలంగా స్పందించారని కేసీఆర్ చెప్పారు. మహారాష్ట్ర కూడా తెలంగాణ ప్రాజెక్టులకు సానుకూలంగా ఉందని, తెలుగు రాష్ట్రం ఏపీ కూడా సహకరించాలన్నారు.
యాదాద్రి తరహాలో భద్రాద్రిని అభివృద్ధి చేస్తామని, చినజీయర్ స్వామితో కలిసి 2రోజులు భద్రాచలంలోనే ఉండి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని సీఎం తెలిపారు. వచ్చే మూడేళ్లలో ఖమ్మం జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.
ఈ ఏడాది బడ్జెట్‌లో భద్రాచలం ఆలయ అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. పర్ణశాల, జరాయువు మండపం వద్ద అభివృద్ధి కోసం పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటామన్నారు.
కృష్ణా, గోదావరి నదుల మధ్య ఉన్న ఖమ్మం జిల్లాకు కరువు పరిస్థితులు రాకూడదన్నారు. ఖమ్మం జిల్లాకు రెండు సాగునీటి ప్రాజెక్టులు మంజూరు అయ్యాయని గుర్తు చేశారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయ్యాక చాలా అద్భుతాలు జరుగుతాయన్నారు.
సాగునీటి ప్రాజెక్టులపై కనీస అవగాహన లేకుండా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రాబోయే కాలంలో ఖమ్మంను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం ముందంజలో ఉందని సీఎం కెసిఆర్ వివరించారు.












Click it and Unblock the Notifications