ఆపరేషన్ ఆకర్ష్: 'కెసిఆర్ కేబినెట్లో కొత్త మంత్రిత్వ శాఖ, జగదీశ్వర్‌కు బాధ్యతలు'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని విపక్షాలను తమ పార్టీలో చేర్చుకుంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం నాడు మండిపడ్డారు. టిఆర్ఎస్ పార్టీలో 'ఆపరేషన్ ఆకర్ష్' పేరిట కొత్త మంత్రిత్వ శాఖ ఉందని వ్యంగ్యంగా అన్నారు.
అధికార పార్టీలో ఆపరేషన్ ఆకర్ష్ అనే కొత్త మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేశారన్నారు. ఆ శాఖ బాధ్యతలు నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్దతి కాదని హితవు పలికారు.
వలసలు ప్రోత్సహిస్తూ ఆ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ధ్వజమెత్తారు. వరంగల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు డిపాజిట్లు రాకుండా చేశామని చెబుతున్న టిఆర్ఎస్, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాంపు రాజకీయాలను ఎందుకు ప్రోత్సహిస్తుందో చెప్పాలన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష, వామపక్ష పార్టీలను కలుపుకుని పోతామన్నారు. కాగా, ఇటీవల కాంగ్రెస్, టిడిపిల నుంచి పెద్ద ఎత్తున టిఆర్ఎస్‌లోకి వలసలు వెళ్తున్న విషయం తెలిసిందే.
హైదరాబాద్ నుంచి టిడిపి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్ (మంత్రి), తీగల కృష్ణా రెడ్డి, సాయన్న తదితరులతో పాటు ఇతర నేతలు కూడా కారు ఎక్కారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా డి శ్రీనివాస్ వంటి నేతలు వెళ్లారు. తాజాగా దానం నాగేందర్ టిఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications