కేసీఆర్ మూడోసారి సీఎం ఖాయం: ప్రజల మూడ్ తెలుసంటూ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణలో నాలుగు మూలలు తిరిగానని.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుటుందని ప్రజలు విశ్వసిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. బుధవారం మంత్రి కేటీఆర్ (KTR) సమక్షంలో దేవరకొండకు చెందిన బిల్యా నాయక్ అనుచరులు బీఆర్ఎస్‌లో చేరారు.
గిరిజన జాతికి రిజర్వేషన్లు పెంచిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయని.. అవాస్తవాలు చెప్పిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా తప్పుడు సర్వేల పేరుతో హడావిడి చేయడం.. కాంగ్రెస్‌కు అలవాటేనని దీని వల్ల జరిగేదేమి లేదన్నారు.

ఎన్నికలు రాగానే కాంగ్రెస్ పార్టీ వాళ్లు.. కొత్త అంగిలాగు కుట్టించుకుంటారు.. ఇళ్లకు సున్నాలు వేసుకుంటారని కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రి తానంటే తాను అని పోటీ పడుతారు. ఇక మీడియాలో కూడా సర్వే వస్తది.. అంతా అయిపోయిందంటారు. గమ్మతైన డైలాగులు, ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తారని కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించారు కేటీఆర్. అప్పుడు ఓటుకు నోటు.. ఇప్పుడు సీటుకు ఓటు అంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శించారు.
కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా.. హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. త్వరలో ప్రకటించబోయే బీఆర్ఎస్ మానిఫెస్టోలో.. సబ్బండ వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చేలా రూపొందించినట్లుగా కేటీఆర్ పేర్కొన్నారు.
తమ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు.
గత 15 రోజుల నుంచి 32 నియోజకవర్గాలకు వరకు తిరిగానని కేటీఆర్ చెప్పారు. ఆదిలాబాద్ నుంచి వనపర్తి దాకా, సత్తుపల్లి నుంచి మెదక్ వరకు.. తెలంగాణలోని నాలుగు మూలాలను తిరిగాను. ప్రజల మూడ్ స్పష్టంగా కనబడుతోంది. ప్రజల నుంచి అసహనం వ్యక్తం కావడం లేదు. ప్రభుత్వం మీద వ్యతిరేకత కనబడకపోగా, కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయితేనే పేదలు, రైతులు, బడుగు, బలహీన వర్గాలు బాగుంటారని ప్రజలు విశ్వసిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications