Kalvakuntla Kavitha : కేసీఆర్ సస్పెన్షన్ కు కవిత కౌంటర్-రెండు అస్త్రాలు..!
గత కొంతకాలంగా బీఆర్ఎస్ తో విభేదిస్తూ, ఆ పార్టీ కీలక నేతలపై విమర్శలు గుప్పిస్తున్న అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నిన్న సస్పెండ్ చేశారు. పార్టీ నేతలపై చేస్తున్న విమర్శలు, క్రమశిక్షణా రాహిత్యంగా పరిగణించి ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో మరింత రెచ్చిపోయిన కవిత.. ఇవాళ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు, సంతోష్ రావుపై మరోసారి విమర్శలకు దిగిన కవిత అనంతరం తన పదవులకు రాజీనామాలు చేశారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామాలు చేస్తూ విడివిడిగా కేసీఆర్, తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ లకు కవిత లేఖలు రాశారు. ఇందులో తన రాజీనామాను ఆమోదించాలంటూ ఏకవాక్యాన్ని మాత్రమే రాశారు. అంతకు మించి ఎలాంటి కారణాన్నీ పేర్కొనలేదు. ప్రెస్ మీట్ లో మాత్రం హరీష్ రావు, సంతోష్ రావు, రేవంత్ రెడ్డిపై కవిత మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.

మరోవైపు ఇప్పటికే పార్టీలో జరుగుతున్న పరిణామాల్నితప్పుబడుతూ జాగృతి పేరుతో సొంత సంస్ధను పటిష్టం చేసుకుంటున్న కల్వకుంట్ల కవిత.. ఇప్పుడు తాడోపేడో తేల్చుకోవాలని తీసుకున్న నిర్ణయంతో రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. అందుకే నేరుగా హరీష్ రావు, సంతోష్ రావుపై విమర్శలు ఎక్కుపెట్టి సస్పెండ్ అయ్యారు. దీన్ని అవకాశంగా మార్చుకుని ఇవాళ పార్టీకీ, ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా సమర్పించారు. తద్వారా బీఆర్ఎస్ కే రాజీనామా చేేసాక ఆ పార్టీ ద్వారా లభిెంచిన ఎమ్మెల్సీ పదవి తనకు అక్కర్లేదనే క్లియర్ మెసేజ్ ను కవిత ఇచ్చేశారు. దీంతో బీఆర్ఎస్ తో పూర్తిగా తెగతెంపులు చేసుకున్న కవిత ఇప్పుడు కొత్త పార్టీతో రంగంలోకి దిగి ఏం చేయబోతున్నారు, ఆమెకు లభించే మద్దతెంత అనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి.












Click it and Unblock the Notifications