25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చేందుకు.. కేరళ నుంచి తెలంగాణకు.. ఈయన మామూలు వ్యక్తి కాదు..!
ఈ రోజుల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది కేవలం సినిమాల్లోనే చూస్తుంటాం. ఇక అప్పు తీసుకుని ఇవ్వకుండా సంవత్సరాల పాటు ఇంటి చుట్టూ తిప్పించుకునేవారు చాలామందే ఉంటారు. ఇంకొంత మంది అప్పు ఇచ్చిన వారిపైనే దాడులకు పాల్పడుతుంటారు. అయితే ఇప్పుడు జరిగిన ఓ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఎప్పుడో పాతికేళ్ల క్రితం తీసుకున్న అప్పును తిరిగి ఇచ్చేందుకు కేరళ నుంచి ఏకంగా తెలంగాణలోని ధర్మపురికి వచ్చాడు ఓ వ్యక్తి. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
కేరళలోని పాలక్కాడ్ కు చెందిన ఇస్మాయెల్ బతుకుదెరువు కోసం 25 ఏళ్ల క్రితం సౌదీకు వెళ్లాడు. అదే సమయంలో జగిత్యాల జిల్లాలోని ధర్మపురి పట్టణానికి చెందిన ఎడ్ల లచ్చన్న సౌదీ కు పనికోసం వెళ్లాడు. అలా అక్కడే ఓ కంపెనీలో ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఆ రోజుల్లో ఇస్మాయెల్ కు డబ్బు అవసరం ఏర్పడి తన ఫ్రెండ్ లచ్చన్న వద్ద కొంత సొమ్ము అప్పుగా తీసుకున్నాడు. స్వదేశానికి తిరిగి వెళ్లాక తిరిగి ఇస్తానని మాట ఇచ్చాడు. కానీ అనుకోని పరిస్థితుల కారణంగా స్వదేశానికి వచ్చిన తర్వాత లచ్చన్నతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. దాంతో అప్పు తీర్చే అవకాశం ఇస్మాయెల్ కు లభించలేదు.
అయితే ఎలాగైనా లచ్చన్న రుణభారం తీర్చాలని ఇటీవల ఇస్మాయెల్ అనుకున్నాడు. లచ్చన్న తెలంగాణలోని ధర్మపురి పట్టణంలో ఉంటాడని గుర్తు పెట్టుకున్నాడు ఇస్మాయెల్. అలా ఇటీవల జగిత్యాల జిల్లాలోని ధర్మపురికి చేరుకున్నాడు. పట్టణంలోని ఇంటింటిని అడుగుతూ చివరికి లచ్చన్న ఇంటిని గుర్తించాడు. అయితే ఆ సమయంలో లచ్చన్న గల్ఫ్ దేశంలో ఉన్నాడు. ఇక తాను 25 ఏళ్ల క్రితం తీసుకున్న అప్పును తీర్చేందుకు ఇంత దూరం వచ్చానని చెప్పడంతో లచ్చన్న కుటుంబ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలా రూ. 25 వేలను లచ్చన్న కుటుంబానికి ఇస్మాయెల్ అందజేశాడు. ఇంతటితో తన రుణభారం తొలగిపోయిందని భావోద్వేగానికి గురయ్యాడు ఇస్మాయెల్.

ఆ తర్వాత లచ్చన్నతో ఫోన్ లో మాట్లాడాడు. లచ్చన్న కూడా ఇస్మాయెల్ ను గుర్తుపట్టి భావోద్వేగానికి లోనయ్యాడు. పాతికేళ్ల తర్వాత వేల కిలోమీటర్లు ప్రయాణించి అప్పు తీర్చిన ఇస్మాయిల్ నిజాయితీ, స్నేహ బంధానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారని గ్రామస్థులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications